AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2027 : సౌతాఫ్రికా పిచ్‌లపై మనోళ్ల దండయాత్ర.. ఆరుగురు స్పీడ్‌స్టర్లతో బీసీసీఐ ఊరమాస్ ప్లాన్

World Cup 2027 : వరల్డ్ కప్ 2027 కోసం టీమిండియా సెలెక్టర్లు 20 మంది కోర్ టీమ్ ను సిద్ధం చేశారు. బుమ్రా సహా ఆరుగురు పేసర్లు ఉండగా, మహమ్మద్ షమీకి మాత్రం చోటు దక్కలేదు. రోహిత్, కోహ్లీ రేసులో ఉన్నారు.సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం సెలెక్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు.

World Cup 2027 : సౌతాఫ్రికా పిచ్‌లపై మనోళ్ల దండయాత్ర.. ఆరుగురు స్పీడ్‌స్టర్లతో బీసీసీఐ ఊరమాస్ ప్లాన్
Team IndiaImage Credit source: X
Rakesh
|

Updated on: Mar 23, 2026 | 7:27 PM

Share

World Cup 2027 : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరం వన్డే వరల్డ్ కప్ 2027కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టీమిండియా సెలెక్టర్లు అప్పుడే తమ మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసేశారు. ఒకవైపు ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2026 హడావుడిలో ఉంటే, మరోవైపు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాత్రం మిషన్ 2027 కోసం 20 మంది కోర్ టీమ్ (ప్రధాన ఆటగాళ్లు)ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం సెలెక్టర్లు వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఆరుగురు పేసర్లతో స్ట్రాంగ్ లైనప్

సౌతాఫ్రికా, జింబాబ్వేలోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. బంతి బాగా బౌన్స్ అవ్వడమే కాకుండా వేగానికి సహకరిస్తాయి. అందుకే సెలెక్టర్లు ఆరుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను తమ 20 మంది జాబితాలో చేర్చారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు యంగ్ సెన్సేషన్ హర్షిత్ రాణా కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే, గత వరల్డ్ కప్‌లో వికెట్ల వేట సాగించిన మొహమ్మద్ షమీ పేరు ఈ లిస్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫిట్‌నెస్, వయస్సు రీత్యా షమీని పక్కన పెట్టి యువతరం వైపు మొగ్గు చూపాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

రోహిత్-కోహ్లీ జోడీపై క్లారిటీ

చాలా కాలంగా అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న.. 2027 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా? అని. తాజా సమాచారం ప్రకారం, సెలెక్టర్లు సిద్ధం చేసిన 20 మంది జాబితాలో ఈ ఇద్దరు దిగ్గజాల పేర్లు కూడా ఉన్నాయి. జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, రోహిత్, కోహ్లీ అనుభవం జట్టుకు అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు వీరిద్దరి మార్గదర్శకత్వం తోడైతే కప్పు గెలవడం సులువని బోర్డు యోచిస్తోంది.

ఐపీఎల్ 2026 వేదికగా ఫైనల్ సెలెక్షన్

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌ను సెలెక్టర్లు ఒక గొప్ప ఆడిషన్ లాగా చూస్తున్నారు. పీటీఐ రిపోర్ట్స్ ప్రకారం.. సెలెక్షన్ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వివిధ మైదానాల్లో జరిగే మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. తాము అనుకున్న 20 మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ప్రస్తుత ఫామ్‌ను నిశితంగా గమనిస్తారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ 20 మంది నుంచి తుది 15 మందిని వరల్డ్ కప్ స్క్వాడ్ కోసం ఎంపిక చేయనున్నారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆల్ రౌండర్లు, స్పిన్నర్ల బలం

జట్టులో బాలెన్స్ కోసం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన అస్త్రంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా లాంటి పిచ్‌లపై కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా కుల్దీప్‌కు ఉండటం ప్లస్ పాయింట్. మొత్తం మీద పక్కా ప్రణాళికతో, అనుభవం, స్పీడ్ కలగలిసిన జట్టును తయారు చేసే పనిలో సెలెక్టర్లు నిమగ్నమై ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us