Mumbai Indians : ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యాపై వేటు పడనుందా?
Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై సందేహాలు పెరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్ మద్దతు ఇస్తుందా? లేక మెగా వేలానికి ముందు షాక్ నిర్ణయం తీసుకుంటుందా? రోహిత్, సూర్య, బుమ్రా ఉన్న టీమ్‌లో పాండ్యా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) పరిస్థితి చాలా దారుణంగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు ప్రదర్శన ఇంత దారుణంగా ఉన్నా కూడా మేనేజ్‌మెంట్ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందా? లేక వేటు వేస్తుందా? అనే చర్చ మొదలైంది. తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం దీనిపై రియాక్ట్ అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. మొదటి ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై, 2025లో పర్వాలేదనిపించినా (4వ స్థానం), ఇప్పుడు 2026లో మళ్లీ దారుణమైన స్థితికి చేరుకుంది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అయితే ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ముంబై మేనేజ్‌మెంట్ ఇప్పటికీ పాండ్యా వెంటే నిలుస్తోంది. జట్టు ఓటములకు అతడి నాయకత్వం కారణం కాదని, మారుతున్న ఆట తీరుకు జట్టు అనుగుణంగా మారలేకపోవడమే అసలు సమస్య అని వారు నమ్ముతున్నట్లు సమాచారం.
ముంబై మేనేజ్‌మెంట్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్‌లో జట్లన్నీ విధ్వంసకర ఆరంభాలను కోరుకుంటున్నాయి. ఓపెనర్లు మెరుపు వేగంతో పరుగులు రాబట్టడం, బౌలర్లు పవర్‌ప్లేలోనూ, డెత్ ఓవర్లలోనూ ప్రభావం చూపడం చాలా ముఖ్యం. ముంబై ఇండియన్స్ ఈ విషయంలో వెనుకబడిందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంటే కేవలం కెప్టెన్ నిర్ణయాల వల్లే కాకుండా, ఆటగాళ్ల సమిష్టి వైఫల్యం వల్లే జట్టు ఓడిపోతోందని వారు పాండ్యాను వెనకేసుకొస్తున్నారు.
మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం ముంబై మేనేజ్‌మెంట్ నిర్ణయంపై భిన్నంగా స్పందించారు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలానికి ముందు ముంబై ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలనే ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ.. “వచ్చే ఏడాది మీ కెప్టెన్ ఎవరు? ఒకవేళ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఉంచకూడదని భావిస్తే, అతడిని వదిలేయడమే మంచిది. ఎందుకంటే మూడు ఏళ్లుగా విఫలమవుతున్న వాతావరణంలో, తన పదవి పోతుందనే ఒత్తిడిలో పాండ్యా సరిగ్గా ఆడలేకపోవచ్చు. ఒకవేళ కెప్టెన్సీ భారం తగ్గిస్తే అతను స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.
మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను రిలీజ్ చేస్తారా? లేక కెప్టెన్‌గా కొనసాగిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి వారు ఉండగా.. వారిని కాదని పాండ్యాకు పగ్గాలు ఇవ్వడం ఫ్యాన్స్‌కు ఇప్పటికీ నచ్చడం లేదు. మేనేజ్‌మెంట్ బయటకు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సీజన్ మిగిలిన మ్యాచ్‌ల్లో ముంబై ఎలా ఆడుతుందనే దానిపైనే పాండ్యా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
