శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!
తిరుమలలో 2026 జూన్ నెలలో భక్తుల రద్దీతో హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. హుండీ ద్వారా రూ.128.29 కోట్ల ఆదాయం లభించగా, 1.26 కోట్లకు పైగా శ్రీవారి లడ్డూలు విక్రయమయ్యాయి. ఏఐ ఆధారిత భక్తుల నిర్వహణ వ్యవస్థతో టీటీడీ దర్శనాలను సమర్థవంతంగా నిర్వహించి మరో మైలురాయిని నెలకొల్పింది.
“కలియుగ ప్రత్యక్ష దైవం… అపర కుబేరుడు… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయమైన తిరుమలలో ఈ వేసవిలో మరో అరుదైన రికార్డు నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు… హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ చరిత్రలో నిలిచే స్థాయికి చేరాయి. ఒకవైపు రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కల్పించింది. ప్రస్తుతం టీటీడీ విడుదల చేసిన జూన్ నెల గణాంకాలు చూస్తే… శ్రీవారిపై భక్తుల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. మరి జూన్ నెలలో తిరుమలలో నమోదైన ఆ రికార్డులు ఏంటి..? హుండీ ఆదాయం ఎంత వచ్చింది..? లడ్డూ విక్రయాలు ఎంత పెరిగాయి..? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.” తిరుమల అంటేనే భక్తి, విశ్వాసానికి ప్రతీక. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. అయితే 2026 వేసవి మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. భక్తుల రద్దీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు రెండూ కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఒకవైపు స్వామివారి దర్శనం కోసం రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివస్తుండగా.. మరోవైపు టీటీడీ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడం విశేషంగా నిలిచింది. వేసవి సెలవులు, పైగా కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో జూన్ నెల మొత్తం తిరుమల కొండ కిటకిటలాడింది. ఈ భక్తుల రద్దీ నేరుగా హుండీ ఆదాయంపై ప్రభావం చూపింది. టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2026 జూన్ నెలలో హుండీ ద్వారా రూ.128 కోట్ల 29 లక్షల 80 వేల 410 రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.119 కోట్ల 85 లక్షల 44 వేల 180 రూపాయల ఆదాయం రాగా.. ఈసారి అదనంగా రూ.8 కోట్ల 44 లక్షల 36 వేల 230 రూపాయలు పెరిగాయి. అంటే ఏడాది వ్యవధిలో హుండీ ఆదాయం 7.04 శాతం వృద్ధి చెందింది. ఈ గణాంకాలు కేవలం ఆదాయం పెరిగిందనే విషయాన్ని మాత్రమే చెప్పడం లేదు. శ్రీవారిపై భక్తుల విశ్వాసం, తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య ఎంతగా పెరుగుతోందో కూడా స్పష్టం చేస్తున్నాయి. కలియుగ అపర కుబేరుడిగా భావించే వెంకన్నకు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ సమర్పించే కానుకలు ప్రతి ఏడాది కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అపారమైన ఆస్తులు కలిగిన తిరుమల దేవస్థానం మరింత సంపన్నంగా మారుతోంది. జూన్ నెలలో నాలుగు రోజుల పాటు హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలను దాటడం మరో విశేషం. జూన్ 15న రూ.5.04 కోట్లు, జూన్ 23న రూ.5.18 కోట్లు, జూన్ 29న రూ.5.62 కోట్లు, జూన్ 30న రూ.5.30 కోట్ల హుండీ ఆదాయం టీటీడీ ఖాతాలో జమైంది. ఒక్క రోజులో భక్తులు ఐదు కోట్లకు పైగా కానుకలు సమర్పించడం తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టంగా చెప్పవచ్చు. హుండీ ఆదాయంతో పాటు మరో ముఖ్యమైన రికార్డు కూడా నమోదైంది. అదే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు. తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడి మనసుకు శ్రీవారి లడ్డూ ఒక ప్రసాదం మాత్రమే కాదు.. ఒక దైవానుభూతి. దర్శనం అనంతరం లడ్డూ తీసుకోవడం సంప్రదాయం. ఈ ఏడాది జూన్ నెలలో టీటీడీ ఏకంగా 1 కోటి 26 లక్షల 81 వేల 805 లడ్డూలను విక్రయించింది. ఇది గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే 7 లక్షల 59 వేల 452 లడ్డూలు ఎక్కువ. అంటే 6.37 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు.. 2024 జూన్ నెలతో పోలిస్తే ఈసారి 24 లక్షల 17 వేల 441 లడ్డూలు అదనంగా విక్రయమయ్యాయి. దీంతో రెండేళ్లలో లడ్డూ విక్రయాలు 23.55 శాతం పెరిగినట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.11 కోట్ల లడ్డూలు, మే నెలలో 1.21 కోట్ల లడ్డూలు, జూన్ నెలలో 1.26 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించడంతో ప్రతి నెల భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ లడ్డూ డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చినా.. ఎక్కడా లడ్డూల కొరత ఏర్పడకుండా టీటీడీ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించింది. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి లడ్డూ తయారీని భారీగా పెంచింది. నెయ్యి, పంచదార, శెనగపిండి, డ్రైఫ్రూట్స్ వంటి ముడి సరుకులను ముందుగానే సిద్ధం చేసి ఉత్పత్తిని నిరంతరం కొనసాగించింది. దీంతో ప్రతీ భక్తుడికి ఎలాంటి ఆలస్యం లేకుండా శ్రీవారి ప్రసాదం అందేలా చర్యలు తీసుకుంది. ఈసారి తిరుమలలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏఐ ఆధారిత భక్తుల నిర్వహణ వ్యవస్థ. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా అత్యాధునిక ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. ఎక్కడ రద్దీ పెరుగుతోంది.. ఏ క్యూలైన్‌లో ఎంతమంది ఉన్నారు.. ఏ ప్రాంతంలో అదనపు సిబ్బంది అవసరం అనే విషయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా వచ్చే భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి.. అందుకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలోని ప్రతి కంపార్ట్‌మెంట్‌లో భక్తుల ప్రవేశ సమయం నుంచి దర్శనం పూర్తయ్యే వరకు డిజిటల్ పర్యవేక్షణ కొనసాగింది. ఎస్‌ఈడీ, ఎస్‌ఎస్‌డీ టోకెన్లతో వచ్చే భక్తుల ఎంట్రీలను కెమెరా ఫుటేజీలతో సరిపోల్చుతూ క్యూలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సాంకేతిక వ్యవస్థ వల్ల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా భక్తులకు పెద్దగా ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడం సాధ్యమైంది. టీటీడీ దర్శనం మాత్రమే కాకుండా అన్నప్రసాదం, తాగునీరు, వసతి, వైద్య సేవలు, రవాణా, లడ్డూ పంపిణీ వంటి అన్ని విభాగాల్లో సమన్వయంతో పనిచేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగం అప్రమత్తంగా వ్యవహరించింది. దీంతో లక్షలాది మంది భక్తులు సాఫీగా శ్రీవారిని దర్శించుకుని సంతృప్తిగా తిరుగు ప్రయాణం చేశారు. హుండీ ఆదాయం పెరగడం, లడ్డూ విక్రయాలు రికార్డు స్థాయికి చేరడం, అత్యాధునిక ఏఐ సాంకేతికతతో భక్తుల దర్శనాల నిర్వహణ విజయవంతం కావడం.. ఈ మూడు అంశాలు కలిసి 2026 వేసవిని తిరుమల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిపాయి. భక్తుల విశ్వాసం ఎంత పెరుగుతుందో.. ఆ విశ్వాసానికి అనుగుణంగా టీటీడీ కూడా తన సేవలను మరింత ఆధునికంగా, మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకుంటోందనడానికి ఇవే నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక నిర్వహణ వ్యవస్థగా తిరుమలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి తిరుమలలో వీఐపీ దర్శనం
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

