AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ద డీప్‌ఫేక్ డిఫెన్స్'.. టాలీవుడ్ స్టార్స్ Vs AI

‘ద డీప్‌ఫేక్ డిఫెన్స్’.. టాలీవుడ్ స్టార్స్ Vs AI

Phani CH
|

Updated on: Jul 06, 2026 | 4:36 PM

Share

ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ దక్షిణాది సినీ పరిశ్రమకు కొత్త సవాలుగా మారింది. ప్రముఖ నటుల ముఖాలు, గొంతులను అనుమతి లేకుండా ఉపయోగిస్తూ నకిలీ వీడియోలు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిత్వ హక్కులు, పరువు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం ఉన్న చట్టాలు ఎంతవరకు రక్షణ కల్పిస్తున్నాయో తెలుసుకోండి.

మనం చేస్తున్నవన్నీ నిజం కాదు. మనం వింటున్నవన్నీ వర్జినల్ కాదు.. మన కళ్లు, మన మెదడు.. మనల్నే మోసం చేస్తున్నాయి. ఇది మీరు నమ్మగలరా? ఎందుకంటే ఇది డీప్ ఫేక్ జనరేషన్‌. ఇక్కడ పావులో సగం వంతు.. అంతా Ai మాయే. టెక్నాలజీ పెరిగితే సౌకర్యాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ అదే టెక్నాలజీ ఒక మనిషి ఉనికిని, ఒక నటుడి దశాబ్దాల కష్టాన్ని, ఒక సెలబ్రిటీ గౌరవాన్ని కేవలం కొన్ని క్లిక్‌లలో బూడిద చేయగలదని ఊహించలేదు. సౌత్ ఇండియన్ సినిమా… నేడు గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోతోంది. వందల కోట్లు, వేల కోట్ల మార్కెట్. కానీ, ఈ గ్లామర్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఒక అదృశ్య శత్రువు భయపెడుతున్నాడు. అదే AI అండ్ డీప్‌ఫేక్. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి… మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సూర్య, రష్మిక వరకు… సౌత్ స్టార్లు ఇప్పుడు కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. వాళ్లు సైబర్ నేరగాళ్లపై కాదు… టెక్నాలజీపై, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తున్నారు. దీనినే లీగల్ భాషలో “ద డీప్‌ఫేక్ డిఫెన్స్” అంటున్నారు. అసలు సౌత్ స్టార్లు ఎందుకు దావాలు వేస్తున్నారు? దీని వెనుక ఉన్న లీగల్ లూప్‌హోల్స్ ఏంటి? సినిమా భవిష్యత్తు ప్రమాదంలో పడిందా? అనే విషయాల గురించి ఇవ్వాల్టి ఎక్స్‌ప్లేనర్‌లో లోతుగా చర్చిద్దాం. మొదటగా మనం శత్రువుని అర్థం చేసుకోవాలి. అంటే డీఫ్‌ ఫేక్‌ ని అర్థం చేసుకోవాలి. అసలు డీప్‌ఫేక్ అంటే ఏంటి?!! ‘డీప్ లెర్నింగ్’, ‘ఫేక్’ అనే రెండు పదాల కలయికే ఈ డీప్‌ఫేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒకరి ముఖాన్ని, గొంతును, హావభావాలను మరొకరి శరీరానికి అతికించడమే ఈ టెక్నాలజీ. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే.. GANs – Generative Adversarial Networks అనే రెండు AI అల్గారిథమ్స్ ఇందులో పనిచేస్తాయి. ఒకటి ఫేక్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తే, రెండోది అది నిజమా అబద్ధమా అని టెస్ట్ చేస్తుంది. అలా మిలియన్ల సార్లు ప్రాసెస్ చేసి, కంటికి దొరకనంత పర్ఫెక్ట్‌గా నకిలీ వీడియోను సృష్టిస్తాయన్న మాట. ఒకప్పుడు ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ చేయాలంటే హాలీవుడ్ స్టూడియోలు, వందల కోట్లు, నెలల సమయం పట్టేది. కానీ ఈరోజు? కేవలం ఒక ల్యాప్‌టాప్, ఒక ఉచిత AI టూల్ ఉంటే చాలు… మీరు ఇంట్లోనే కూర్చొని ఏ స్టార్ హీరోనైనా మీకు నచ్చినట్టు నటింపజేయొచ్చు. అయితే సౌత్ ఇండియాలో ఇది ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మారిందంటే..!!! ఇక్కడ సినిమారంగం కేవలం వినోదం కాదు… అదొక ఎమోషన్. ఇక్కడి స్టార్లను దేవుళ్లలా చూస్తారు. దాన్ని దెబ్బతీయడం అంటే వందల కోట్ల బిజినెస్‌ను, అభిమానాన్ని దెబ్బతీయడమే. ఇది కేవలం ఒక ఫేక్ వీడియో సమస్య కాదు. దీని వెనుక మూడు ప్రధానమైన కోణాలు ఉన్నాయి. నెంబర్ 1, పర్సనాలిటీ రైట్స్- ఒక నటుడి ముఖం, గొంతు, పేరు వారి సొంత ఆస్తి. వాటిని వారి అనుమతి లేకుండా వాడి వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. నెంబర్ 2. Financial Damage- ఒక స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి కోట్లు తీసుకుంటారు. కానీ ఒక లోకల్ షాప్ యజమాని AI ద్వారా ఆ హీరో ముఖాన్ని వాడుకుని ఫ్రీగా యాడ్ చేసుకుంటే… ఆ స్టార్ మార్కెట్ వాల్యూ ఏమవ్వాలి? నెంబర్ 3. Character Assassination- ఎన్నికల సమయంలో ఒక టాప్ హీరో పలానా పార్టీకి ఓటు వేయమని చెప్పినట్టు డీప్‌ఫేక్ వాయిస్ క్రియేట్ చేస్తే… అది రాజకీయంగా, సామాజికంగా ఎంతటి అలజడి సృష్టిస్తుంది? అందుకే, సౌత్ స్టార్లు ఇప్పుడు కేవలం ‘రియాక్ట్’ అవ్వడం లేదు… ‘ప్రోయాక్టివ్’గా లీగల్ వార్ డిక్లేర్ చేశారు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ ఎలాగైతే తమ పర్సనాలిటీ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకున్నారో… ఇప్పుడు సౌత్ ఇండియాలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ , చరణ్ , పవన్, పవన్ కొడుకు అఖీరా కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. AI అనేది పూర్తిగా చెడ్డదేమీ కాదు. సినిమా ఇండస్ట్రీ కూడా AIని వాడుకుంటోంది. చనిపోయిన నటులను మళ్లీ స్క్రీన్ పైకి తేవడానికి మేకర్స్ Aiనే నమ్ముకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్.. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ లేదా.. తమిళ నటుడు విజయ్ కాంత్‌ను రీసెంట్ సినిమాల్లో చూశాం కదా.. అదంతా ఏఐ వల్లే ఆయా ఫిల్మ్ మేకర్స్కు ఈజీగా సాధ్యం అయింది. ఇదే కాదు డీ-ఏజింగ్ కి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ AI సాంకేతికత మీదే ఆధారపడుతోంది. డీ ఏజింగ్ అంటే వయసైన హీరోలను మళ్లీ కుర్రాళ్లుగా చూపించడం. దీన్ని AI అద్భుతంగా చేస్తోంది. ఇండస్ట్రీ కూడా AIని బాగే వాడుకుంటోంది.. మరి సమస్య ఎక్కడ వస్తుందంటే… అంటే.. Consent దగ్గర వస్తోంది. సినిమా నిర్మాతలు డబ్బులు ఇచ్చి, పర్మిషన్ తీసుకుని టెక్నాలజీని వాడుకుంటే అది క్రియేటివిటీ. కానీ, ఇంటర్నెట్‌లో ఎవరో ఒక అనామకుడు, ఒక స్టార్ ఇమేజ్‌ని వాడుకుని మీమ్స్ చేయడం, పొలిటికల్ ప్రచారాలు చేయడం, లేదా పోర్నోగ్రఫీకి వాడటం… అది విధ్వంసం అన్నట్టేగా..! దీనివల్ల భవిష్యత్తులో నటుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. రేపు పొద్దున ఒక ప్రొడ్యూసర్ హీరోకి రూ. 100 కోట్లు ఇచ్చే బదులు… రూ. 10 లక్షలు ఇచ్చి “నీ ముఖాన్ని, వాయిస్‌ని AI లో వాడుకుంటాం” అని అగ్రిమెంట్ రాసుకుంటే… అసలు నటుడి అవసరం ఏముంటుంది? హాలీవుడ్‌లో రైటర్స్, యాక్టర్స్ నెలల తరబడి సమ్మె చేసింది సరిగ్గా ఇందుకోసమే! ఇప్పుడు అదే భయం సౌత్ సినిమాను కూడా వెంటాడుతోంది. భారతదేశంలో డీప్‌ఫేక్స్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేకమైన “డీప్‌ఫేక్ చట్టం” అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం మనకున్న చట్టాల్లో IT యాక్ట్, 2000, సెక్షన్ 66D, 66E, 67 కింద. కంప్యూటర్ వనరులను ఉపయోగించి మోసం చేసినా.. ప్రైవసీని భంగపరచినా కేసులు పెట్టొచ్చు. భారతీయ న్యాయ సంహిత అంటే BNS చట్టం కింద.. పరువు నష్టం, ఫోర్జరీ కి సంబంధించిన కేసులు పెట్టొచ్చు. కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం.. నటుల Performers’ Rights ను కాపాడతారు. కానీ ఇవన్నీ ‘పోస్ట్-మార్టమ్’ లాంటివి. అంటే నేరం జరిగిన తర్వాత యాక్షన్ తీసుకునేవి. నేరం జరగకుండా ఆపగలిగే శక్తి వీటికి లేదు. పైగా, ఇంటర్నెట్‌లో ఒక వీడియో అప్‌లోడ్ అయ్యాక… అది క్షణాల్లో మిలియన్ల మందికి చేరుతుంది. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసినా లాభం లేదు. ఇక్కడ మరో పెద్ద సమస్య… అజ్ఞాతవాసం. ఈ డీప్‌ఫేక్స్ క్రియేట్ చేసేవాళ్లు ఎక్కడో డార్క్ వెబ్‌లోనో, లేదా విదేశీ సర్వర్ల వెనుక దాక్కుని ఉంటారు. వారిని పట్టుకోవడం మన సైబర్ పోలీసులకు ఒక పెద్ద సవాల్. అందుకే మన స్టార్లు టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్స్ అయినా Google, Meta, X పై కూడా ఒత్తిడి తెస్తున్నారు — “మీరు మీ అల్గారిథమ్స్ ద్వారా వీటిని ముందే గుర్తించి ఎందుకు బ్లాక్ చేయరు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక జీని లాంటిది. దాన్ని ఒకసారి సీసాలోంచి బయటకు తీశాక… మళ్లీ లోపలికి పంపించలేం. టెక్నాలజీని మనం నిషేధించలేం. కానీ నియంత్రించగలం. దక్షిణాది సినీ పరిశ్రమ చేస్తున్న ఈ లీగల్ పోరాటం కేవలం వారి స్వార్థం కోసం కాదు. ఈరోజు చిరంజీవికో.. రజనీకాంత్‌కో, రష్మికకో కోర్టులకు వెళ్లే శక్తి ఉంది, లాయర్లను పెట్టుకోగలరు. కానీ రేపు ఇదే సమస్య ఒక సామాన్య మహిళకో, ఒక సామాన్య విద్యార్థికో వస్తే పరిస్థితి ఏంటి? స్టార్ల పోరాటం… రేపటి సమాజానికి ఒక లీగల్ ప్రెసిడెంట్ గా మారుతోంది. సినిమా అనేది కలల ప్రపంచం. ఆ కలలో నిజాయితీ ఉంది, కష్టం ఉంది, కళ ఉంది. టెక్నాలజీ ఆ కళను మెరుగుపరచాలి కానీ… కళాకారుడి ఉనికినే ప్రశ్నించేలా మారకూడదు. “ద డీప్‌ఫేక్ డిఫెన్స్” అనేది కేవలం సౌత్ సినిమా స్టార్ల లీగల్ వార్ కాదు… ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మధ్య జరుగుతున్న ఉనికి పోరాటం. ఇందులో ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక ప్రేక్షకుడిగా, ఒక పౌరుడిగా మనం చేయాల్సిందల్లా ఒక్కటే… ఒక వీడియో మన ముందుకు రాగానే దాన్ని బ్లైండ్‌గా నమ్మేయడం ఆపాలి. ‘చూసేదంతా నిజం కాదు… వినేదంతా నిజం కాదు’ అనే ప్రాథమిక సూత్రాన్ని డిజిటల్ యుగంలో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..

Weather Update: తీరానికి దూసుకొస్తున్న వాయుగుండం! ముంబైని ముంచేసింది.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

Tirupati: లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Follow Us