Weather Update: తీరానికి దూసుకొస్తున్న వాయుగుండం! ముంబైని ముంచేసింది.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు నగరాల్లో ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావంతో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణం ఎవరూ ఊహించని విధంగా మారిపోతోంది. ఒకవైపు ప్రకృతి తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ వాయుగుండంగా మారి తీరాలను వణికిస్తోంది.. ముంబై లాంటి మహానగరాలను ముంచెత్తుతోంది. మరోవైపు, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నగరాలన్నీ నిప్పుల గుండాలుగా మారిపోతున్నాయి! ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించిందని మనం సంతోషించే లోపే, వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వాయుగుండం ఇప్పుడు మరింత బలపడింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, వాయుగుండం ఉత్తర ఒడిశా తీరంలో ఉంది. ఇది రాబోయే కొన్ని గంటల్లో ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఒడిశాలో తీరం దాటినప్పటికీ, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై చాలా బలంగా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీపై గట్టిగానే కనిపిస్తోంది. దీని కారణంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మబ్బుపట్టి ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు సైతం సముద్ర తీరానికి దూరంగా ఉండాలని చెప్పింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత ఎండల తీవ్రత తగ్గి, చల్లటి గాలులు వీస్తుండటంతో జనం ఉపశమనం లభించిందని ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉండగా.. బుధవారం నాటికి వర్షాల తీవ్రత విపరీతంగా పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై దీని ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించింది. తెలుగు రాష్ట్రాల సంగతి ఇలా ఉంటే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరం పూర్తిగా వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని అత్యంత దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ముంబై సిటీలో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది! ముంబైలోని వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చాలా చోట్ల బలమైన గాలులకు పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ రాబోయే 5 రోజుల పాటు ముంబైతో పాటు చుట్టుపక్కల పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల ఫ్లైట్స్, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేలపై నీరు చేరడంతో పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను వేరే నగరాలకు దారి మళ్లించారు. రానున్న రెండు రోజులు కూడా ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో.. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ, ముంబై మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని నగరాలను వేధిస్తున్న, భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకోవాలి. అదే.. “అర్బన్ హీట్ ఐలాండ్” ప్రభావం! సాధారణంగా నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారు రోడ్లు, వాహనాలు, పరిశ్రమలు పగటిపూట సూర్యుడి నుండి వచ్చే వేడిని విపరీతంగా పీల్చుకుంటాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే రాత్రి వేళల్లో ఈ వేడిని అవి నెమ్మదిగా వాతావరణంలోకి విడుదల చేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల నగరాలు తమ చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల కంటే చాలా ఎక్కువ వేడిగా మారిపోతాయి. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాన్నే “అర్బన్ హీట్ ఐలాండ్” ప్రభావం అంటారు. మీకు తెలుసా? కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 నుండి 7 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదవుతోంది! మన నగరాలు ఇలాంటి ప్రమాదకరమైన ‘హీట్ ట్రాప్’లుగా మారడానికి ముఖ్యమైన కారణాలు మూడు ఉన్నాయి. అందులో అధిక కాంక్రీటీకరణ ఒకటి. రెండోది గాలి ప్రసరణ లోపించడం. ఇక మూడోది కృత్రిమ వేడి. లక్షలాది ఇళ్లలో వాడుతున్న ఎయిర్ కండిషనర్లు బయటకు వదిలే వేడి గాలి, రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాల ఉద్గారాలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే వేడి… నగరాల ఉష్ణోగ్రతను నరకంలా మారుస్తున్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండకు, ఒత్తిడికి గురైన మానవ శరీరం, రాత్రి వేళల్లో చల్లబడటం ద్వారా మాత్రమే సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ రాత్రి కూడా వేడి తగ్గకపోతే, శరీరం ఆ అలసట నుండి కోలుకోలేదు. రాత్రి వేళల్లో అధిక వేడి వల్ల గాఢ నిద్ర కరువవుతుంది. ఇది దీర్ఘకాలంలో రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, విపరీతమైన ఆందోళనకు దారితీస్తుంది. మొత్తానికి ఒకవైపు వాయుగుండం భయం, మరోవైపు నగరాల్లో రాత్రి వేళల్లో పెరుగుతున్న ప్రాణాంతకమైన వేడి. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండటమే మనం చేయగలిగిన ఏకైక పని. కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికలను గుర్తుంచుకోండి, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirupati: లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

