IND Vs PAK : క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ పండగలాంటి న్యూస్.. మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు
IND Vs PAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను పెంచేందుకు ఐసీసీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్రైసిరీస్‌లు, WTCలో టూ-టైర్ విధానం, వరల్డ్ క్లబ్ టీ20 టోర్నీపై చర్చ జరగనుంది. ఈ నిర్ణయాలతో భారత్-పాక్ పోరులు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND VsPAK : ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే క్రేజ్, బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ, సరిహద్దు వివాదాల కారణంగా గత కొంతకాలంగా ఈ ఇరు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2012 తర్వాత వీరి మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. అయితే ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మళ్లీ మ్యాచ్‌లను పునరుద్ధరించేందుకు ఐసీసీ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ వేదికగా జూలై 8, బుధవారం నాడు జరగబోయే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఈ అంశంపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జై షా నేతృత్వంలో జరగనున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 పూర్తి స్థాయి సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో వన్డే క్రికెట్ భవిష్యత్తు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) విస్తరణతో పాటు వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ వంటి ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించనున్నారు. లండన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం.. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ఏడాది పొడవునా నిర్వహించకుండా, కేవలం వన్డే వరల్డ్ కప్‌నకు ముందు వచ్చే 18 నెలల కాలానికి మాత్రమే పరిమితం చేయాలని ఐసీసీ భావిస్తోంది. అలాగే, క్రికెట్‌కు పూర్వ వైభవం, కమర్షియల్ వాల్యూ తీసుకురావడానికి ముక్కోణపు, బహుళ దేశాల టోర్నమెంట్లను మళ్లీ ప్రవేశపెట్టాలని ఐసీసీ గట్టిగా పట్టుబడుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో కూడా ఐసీసీ భారీ మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న 9 జట్లకు అదనంగా మరో మూడు దేశాలను చేర్చి, టూ-టైర్ సిస్టమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో, పాకిస్తాన్ తొమ్మిదో స్థానంలో దిగువ భాగంలో ఉన్నాయి. ఒకవేళ ఈ కొత్త టూ-టైర్ విధానం అమల్లోకి వస్తే, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అంగీకారంతో భారత్, పాకిస్తాన్ జట్లు టెస్ట్ క్రికెట్‌లో తలపడే సువర్ణావకాశం లభిస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య చివరి టెస్ట్ సిరీస్ 2006/07 లో జరిగింది. ఈ కొత్త మార్పులతో సుదీర్ఘ కాలం తర్వాత ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు చూసే భాగ్యం అభిమానులకు కలగనుంది.
అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల టీ20 ఫ్రాంచైజీ క్లబ్‌లను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గతంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 తరహాలోనే వరల్డ్ క్లబ్ టీ20 ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టోర్నీ గనుక పట్టాలెక్కితే, భారత ప్రీమియర్ లీగ్ (IPL)లోని టాప్ టీమ్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లోని అత్యుత్తమ జట్లతో తలపడే అవకాశం ఉంటుంది. గతంలో 2014 లో ప్రేక్షకాదరణ లేక నిలిచిపోయిన ఈ క్లబ్ టోర్నమెంట్‌ను, ఇప్పుడు సరికొత్త హంగులతో పునఃప్రారంభించి భారత్-పాక్ క్రికెట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ఐసీసీ గట్టి పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
