AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahnavi Missing Case: 30 రోజులైంది..! ఊరూరా పోస్టర్లు పంచుతున్న తండ్రి..అసలు పోలీసులు ఏం చేశారు?

Jahnavi Missing Case: 30 రోజులైంది..! ఊరూరా పోస్టర్లు పంచుతున్న తండ్రి..అసలు పోలీసులు ఏం చేశారు?

Phani CH
|

Updated on: Jul 06, 2026 | 5:29 PM

Share

కాకినాడ జిల్లా తుని సమీపంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కోసం నెల రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 12 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజీలు, అడవి గాలింపు, కిడ్నాప్ సహా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతున్నా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారం లభించలేదు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష బహుమతి ప్రకటించారు.

ఒకటి రెండు రోజులు కాదు… ఏకంగా నెల రోజులు పూర్తయ్యాయి.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఇప్పటివరకూ పాప ఎక్కడుందో, ఎలా ఉందో.. ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇది ఇప్పుడు కాకినాడ జిల్లానే కాదు… రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. వందలాది మంది పోలీసులు, 12 ప్రత్యేక దర్యాప్తు బృందాలు, డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా వినియోగించినా… జాహ్నవి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మొదట మిస్సింగ్‌గా భావించిన ఈ కేసు… ఆ తర్వాత కిడ్నాప్ కోణంలోకి వెళ్లింది. తర్వాత అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానం కూడా వ్యక్తమైంది. మరికొద్ది రోజులకు వేటగాళ్ల బారిన పడిందేమోనన్న కోణంలోనూ విచారణ జరిపారు. కానీ ఈ నాలుగు కోణాల్లోనూ ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. జాహ్నవి ఎలా కనిపించకుండా పోయింది? పోలీసుల విచారణలో ఏం తేలింది? ఇప్పుడు ఈ నెల రోజుల మిస్టరీ కేసును మొదటి నుంచి పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఈ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్‌ చూస్తే.. చిన్నారి ఆచూకీ కోసం తునితో పాటు పరిసర గ్రామాల్లో పోలీసులు పోస్టర్లు అంటించి, జాహ్నవి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. జాహ్నవి ఫొటోతో కూడిన పోస్టర్లను ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల గోడలపై అంటించారు. ప్రతి ఒక్కరికీ తెలిసేలా సోషల్ మీడియాలోనూ సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. మరోవైపు, ప్రత్యేక దర్యాప్తు టీమ్ ఆయా ప్రాంతల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది. జూన్ 6న జాహ్నవి మిస్సైన రోజు అసలేం జరిగింది? నాన్న దగ్గరకంటూ అడవిలోకెళ్లిన చిన్నారి.. తిరిగి వెనక్కి రాలేదు.. వెంటనే తల్లిదండ్రులు తుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ రోజు చిన్నారితో పాటే పెంపుడు కుక్క కూడా కనిపించలేదు.. మూడు రోజుల తర్వాత ఇంటివైపు వచ్చిన శునకం.. ఏదో క్లూ ఇస్తుందనుకుంటే అది కూడా అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, కొద్ది రోజుల తర్వాత చిన్నారి అదృశ్యమైన రోజు అంటే జూన్‌ 6న పెంపుడు కుక్క ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో కనిపించడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. ఇక, చిన్నారి తల్లిదండ్రుల విషయానికొస్తే..కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్‌ అగ్రహరంలో సుంకర భవాని -గణేష్‌ దంపతులు ఉంటున్నారు. వీళ్ల గారాలపట్టే జాహ్నవి. పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. చుట్టూ కొండలు.. తోటల మధ్య ఉన్న ఓ ఇంట్లో వీరు ఉంటున్నారు. జూన్‌ 6న ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరకు పరుగు పెట్టింది. కట్ చేస్తే.. పాప తన దగ్గరకు రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. రెండేళ్ల పాప అదృశ్యం.. కన్నవాళ్లకు, గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్‌కి చెందిన 200మందికి పైగా పోలీసులు.. రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా.. ఎలాంటి క్లూ దొరకలేదు. ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్లకి లక్ష రూపాయిల నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ఇక, ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో చిన్నారి మిస్సింగ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో ప్రధానంగా దట్టమైన అటవీ ప్రాంతంలో రెండేళ్ల పాప ఎంత దూరం వెళ్లుంటుంది? ఆ ప్రాంతంలో ఓపెన్ బారుబావులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవన్నీ క్లోజ్‌లో ఉన్నాయా? లేదా? అదేవిధంగా పాప వేటగాళ్ల గాలానికి చిక్కి ఉంటుందా? అనే డౌట్స్‌ వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా చిన్నారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మొదట దీనిని సాధారణ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పట్టారు. స్థానికులు, గ్రామస్తులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చిన్నారి వెళ్లి ఉండే అవకాశం ఉన్న ప్రతి ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే మొదటి రోజు నుంచే ఈ కేసు సాధారణ మిస్సింగ్ కేసులా కనిపించలేదు. ఎందుకంటే జాహ్నవికి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు కాబట్టి. ఇక చిన్నారి అదృశ్యమైన రెండుమూడు రోజుల తర్వాత గాలింపు చర్యలపై మరింత ఫోకస్‌ పెట్టారు. డ్రోన్లను వినియోగించారు. పొలాలు, కాల్వలు, పామాయిల్ తోటలు, అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి ప్రతి ఫ్రేమ్ ను పరిశీలించారు. గ్రామంలోకి వచ్చిన వాహనాలు, బయటకు వెళ్లిన వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను కూడా విశ్లేషించారు. అయినప్పటికీ ఎలాంటి క్లూ లభించలేదు. ఇక, ఈ కేసులో నాలుగో రోజు కీలక మలుపు తిరిగింది. మొదట మిస్సింగ్‌గా నమోదు చేసిన కేసును పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. జాహ్నవి తల్లి కూడా “మా పాప స్వయంగా ఎక్కడికీ వెళ్లదు… ఎవరో తీసుకెళ్లి ఉంటారు” అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో దర్యాప్తు మరింత ఊపందుకుంది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులతో పాటు, ఆ రోజు గ్రామంలో జీడిపిక్కలు ఏరుకోడానికి వచ్చిన సంచార జాతులను ప్రశ్నించారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మొత్తం 12 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో కూడా గాలింపు చేపట్టారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులు, లాడ్జీలు, మార్కెట్ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు అన్నింటినీ తనిఖీ చేశారు. కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ లొకేషన్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. ఒక్క చిన్న సమాచారం వచ్చినా వెంటనే ధృవీకరిస్తూ ముందుకు వెళ్లారు. అయినా..ఈ కేసును ఛేదించే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మరో కొత్త అనుమానం తెరపైకి వచ్చింది. చిన్నారి అడవి జంతువుల బారిన పడి ఉండొచ్చా అనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఒక దశలో కొండచిలువ దాడి జరిగి ఉంటే ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చని స్వయంగా అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో అడవులు, పొదలు, పామాయిల్ తోటల్లో భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. అంతేకాదు, అడవి జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫెన్సింగ్‌కు మాంసంతో కూడిన బొమ్మలను ఏర్పాటు చేసి కెమెరాలతో ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. కానీ ఈ ప్రయోగం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పటికే నెల రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో పోలీసులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మరింత మంది నుంచి ఉపయోగకరమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జాహ్నవి తల్లిదండ్రుల పరిస్థితి రోజురోజుకూ మరింత విషాదంగా మారుతోంది. తల్లి ప్రతి రోజూ తన కుమార్తె కోసం కన్నీరుమున్నీరవుతోంది. “ఎవరైనా తన బిడ్డను తీసుకెళ్లి ఉంటే… దయచేసి క్షేమంగా వదిలేయండి” అంటూ వేడుకుంటోంది. జాహ్నవి తండ్రి చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ పోస్టర్లు పంచుతూ ప్రతి ఒక్కరినీ ఆచూకీ గురించి అడుగుతున్నారు. నెల రోజులు గడిచిన సరే.. తమ కుమార్తె సురక్షితంగా తిరిగి వస్తుందనే ఆశను మాత్రం వారు వదులుకోలేదు. ప్రస్తుతం పోలీసులు ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూనే… మరోవైపు ప్రజల సహకారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. జాహ్నవి గురించి చిన్న సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు.. అది దర్యాప్తును పూర్తిగా మలుపు తిప్పే అవకాశం ఉంది. మొత్తానికి… జూన్ 6న కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. నెల రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ, కేసులో ఇంకా స్పష్టమైన క్లూ దొరకలేదు. తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి మదిలో ఒక్కటే ప్రశ్న… ‘జాహ్నవి ఎక్కడ?'” ఇంతకీ, చిన్నారి ఆచూకీ దొరకుతుందా? లేక ఏపీలోనే అత్యంత మిస్టీరియస్ కేసుల్లో ఒకటిగా మిగిలిపోనుందా? అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!

వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!

అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!

శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!

Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?

Follow Us