Gautam Gambhir : తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా? మనోజ్ తివారీ పంచ్ మామూలుగా లేదుగా
Gautam Gambhir : ఐర్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఓటమి పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ఎత్తకుండానే డ్రెస్సింగ్ రూమ్ నిర్ణయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gautam Gambhir : ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ అవ్వడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ ఈ ఘోర పరాజయంపై తీవ్రంగా స్పందించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. టీమ్ సెలక్షన్ సమయంలో గంభీర్ కొంతమంది సీనియర్ ఆటగాళ్లపై అతిగా నమ్మకం ఉంచారని, ఆ నిర్ణయాల వల్లే భారత్‌కు ఈ అవమానకరమైన ఓటమి ఎదురైందని క్రికెట్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. జట్టులో అవసరానికి మించి ఆల్‌రౌండర్లపై ఆధారపడటం భారత జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని మనోజ్ తివారీ విశ్లేషించారు.
ఈ సిరీస్ ఓటమి తర్వాత మనోజ్ తివారీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ ఓటమికి గాను కొత్త టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను బలిపశువును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఈ సిరీస్ ఓటమికి గల మొత్తం నిందను శ్రేయస్ అయ్యర్ తలపై నెట్టడానికి పిఆర్ ఏజెన్సీలు, మేనేజ్‌మెంట్‌లో నిర్ణయాలు తీసుకునే పెద్దల సన్నిహితులు ఇప్పటికే రంగంలోకి దిగారని నాకు బాగా తెలుసు’ అని తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘోర పరాజయం కేవలం శ్రేయస్ అయ్యర్ వల్ల మాత్రమే రాలేదని ఆయన స్పష్టం చేశారు. జట్టులోని మిగతా బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలమయ్యారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత క్రికెట్ సిస్టమ్ మాత్రం కేవలం శ్రేయస్ అయ్యర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సమస్య మైదానంలో ఆడే ఆటగాళ్లలో లేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని తుగ్లక్ నిర్ణయాలు తీసుకునే ఆ వ్యక్తి (గౌతమ్ గంభీర్)లోనే ఉందని, ఆయన నిర్ణయాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకపోవడమే అసలు ఇబ్బందని తివారీ మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ తప్పుడు నిర్ణయాలపై బహిరంగంగా చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
15 ఏళ్ల వయసున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించకపోవడంపై కూడా మనోజ్ తివారీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘వైభవ్‌ను మొదటి మ్యాచ్ నుంచి ఎందుకు ఆడించలేదు? టి20 ప్రపంచకప్‌లో బాగా ఆడిన కొందరు ఆటగాళ్లు ఐర్లాండ్‌పై కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేస్తారని మీరు గుడ్డిగా ఎలా నమ్ముతారు?’ అని ప్రశ్నించారు.
రెండో టి20 మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ లాంటి సీనియర్‌ను పక్కనబెట్టి, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గేలకు డెబ్యూ ఛాన్స్ ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. జట్టు ఎంపికలో కన్సిస్టెన్సీ లోపించిందని దుయ్యబట్టారు. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో భారత్ సిరీస్ ఓడిపోవడం అత్యంత నిరాశాజనకమైన విషయమని మనోజ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
