AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 KKR : ఐపీఎల్ చరిత్రలోనే ఎరుగని ఘోర రికార్డు.. షారుక్ ఖాన్ టీమ్ పనైపోయినట్టేనా?

IPL 2026 KKR : ఐపీఎల్ 2026 లో కేకేఆర్ అవమానకర రికార్డు మూటగట్టుకుంది. సీఎస్‌కే చేతిలో ఓటమితో వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేకుండా ఆఖరి స్థానంలో నిలిచింది. సంజూ శాంసన్, నూర్ అహ్మద్ మెరుపులు మెరిపించారు.

IPL 2026 KKR : ఐపీఎల్ చరిత్రలోనే ఎరుగని ఘోర రికార్డు.. షారుక్ ఖాన్ టీమ్ పనైపోయినట్టేనా?
Ipl 2026 Kkr
Rakesh
|

Updated on: Apr 15, 2026 | 7:46 AM

Share

IPL 2026 KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో ఆ జట్టు ఖాతాలో ఒక అత్యంత అవమానకరమైన రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ ఇంత దారుణమైన ఆరంభాన్ని ఎప్పుడూ చూడలేదు. ఐపీఎల్ ప్రారంభమై 19 ఏళ్లు కావస్తున్నా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఎప్పుడూ ఇంత దారుణంగా సీజన్‌ను ఆరంభించలేదు. ఈ ఏడాది ఆడిన మొదటి 5 మ్యాచ్‌లలో కేకేఆర్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా జట్టు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో గెలవకపోవడం ఇదే తొలిసారి. ఈ అవమానకర రికార్డు ఇప్పుడు ఆ జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

బ్యాటర్ల వైఫల్యం.. సీఎస్‌కే బౌలర్ల విజృంభణ

193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం ఒక పరుగుకే అవుట్ కాగా, సునీల్ నరైన్ (24) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కెప్టెన్ అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీలు కాసేపు క్రీజులో నిలిచినా స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్ (6), కామెరాన్ గ్రీన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో రోవ్‌మన్ పావెల్ (31), రమణదీప్ సింగ్ (35) పోరాడినా అది కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే సరిపోయింది. సీఎస్‌కే బౌలర్ నూర్ అహ్మద్ 3 వికెట్లతో మాయ చేయగా, అంశుల్ కంబోజ్ 2 వికెట్లతో కేకేఆర్ నడ్డి విరిచారు.

సంజూ, ఆయుష్ మెరుపులు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) విఫలమైనప్పటికీ, సంజూ శాంసన్ (48) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. యువ సంచలనం ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించాడు. డేవాల్డ్ బ్రెవిస్ (41), సర్ఫరాజ్ ఖాన్ (23) చివర్లో వేగంగా ఆడటంతో సీఎస్‌కే పటిష్ట స్థితికి చేరుకుంది. కేకేఆర్ బౌలర్లు చెపాక్ పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్ తప్పి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

కేకేఆర్ భవిష్యత్తు ఏంటి?

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్, ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌ను డూ ఆర్ డై (గెలిచి తీరాల్సిందే) అన్నట్టుగా ఆడాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకింది. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటే సీఎస్‌కే టాప్-4 లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us