IPL 2026 : ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ అవుట్..షకీబ్ పరిస్థితి ఏంటి? ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉంటాడా?
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి తప్పించింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి తప్పించింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ముస్తాఫిజుర్ ఒక్కడేనా? లేక ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఉన్న మరో బంగ్లా స్టార్ షకీబ్ అల్ హసన్ పై కూడా ఈ ప్రభావం పడనుందా? అన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను కేకేఆర్ ఏకంగా రూ.9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కోల్‌కతాలో బంగ్లా ప్లేయర్లను ఆడనివ్వకూడదని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేకేఆర్ అధికారికంగా అతడిని జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ముస్తాఫిజుర్ స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
ఇక షకీబ్ అల్ హసన్ విషయానికి వస్తే..అతను ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందిన MI ఎమిరేట్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఐపీఎల్ నిర్వహించేది బీసీసీఐ, కానీ ILT20 నిర్వహించేది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు. షకీబ్ ఆడుతున్నది దుబాయ్‌లో కాబట్టి, భారత్‌లో జరుగుతున్న నిరసనల ప్రభావం అక్కడ ఉండదు. జనవరి 4న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో కూడా షకీబ్ ఆడే అవకాశం ఉంది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. షకీబ్ అల్ హసన్ పేరు ఐపీఎల్ 2026 వేలం తుది జాబితాలో లేదు. మొదట అతను రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన ప్లేయర్ల జాబితాలో అతని పేరు కనిపించలేదు. అంటే ఇప్పటికే షకీబ్ ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ముస్తాఫిజుర్ విషయంలో జరిగిన పరిణామాలకు, షకీబ్ ఐపీఎల్ భవిష్యత్తుకు పెద్దగా సంబంధం లేదు. కానీ భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లోకి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్‌ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశారు. దేశ సెంటిమెంట్లను గౌరవించాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు రావడంతో బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం వల్ల ఐపీఎల్ 2026లో ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు కూడా కనిపించే అవకాశం లేకుండా పోయింది.
