Joe Root : సచిన్ రికార్డును బద్ధలు కొట్టిన జో రూట్.. ఇక నెక్ట్స్ టార్గెట్ ఆయనే
ప్రముఖ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన సచిన్ రికార్డును రూట్ అధిగమించాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న రూట్, ఈ ఘనత సాధించాడు.

Joe Root : ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్ భారత్‌తో జరుగుతున్న ఓవల్ టెస్ట్‌లో ఒక గొప్ప రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 29 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు.
ఓవల్ టెస్ట్‌లో రూట్ తన కెరీర్‌లో 84వ హోమ్ టెస్ట్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేయడం ద్వారా అతను స్వదేశంలో మొత్తం 7224 పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఆడిన 94 హోమ్ టెస్ట్‌లలో 7216 పరుగులు చేశారు. ఈ గణాంకాలతో రూట్ ఇప్పుడు హోమ్ టెస్ట్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో రూట్ కంటే ముందు ఉన్నది కేవలం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ 92 హోమ్ టెస్ట్‌లలో 7258 పరుగులు సాధించాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ గనుక మరో 35 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే, అతను పాంటింగ్‌ను కూడా అధిగమించి, కొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తాడు.
హోమ్ టెస్ట్‌లలో టాప్ 5 బ్యాట్స్‌మెన్
1. రికీ పాంటింగ్: 92 మ్యాచ్‌లు, 7258 పరుగులు
2. జో రూట్: 84 మ్యాచ్‌లు, 7224 పరుగులు
3. సచిన్ టెండూల్కర్: 94 మ్యాచ్‌లు, 7216 పరుగులు
4. మహేల జయవర్ధనే: 81 మ్యాచ్‌లు, 7167 పరుగులు
5. జాక్వెస్ కాలిస్: 88 మ్యాచ్‌లు, 7035 పరుగులు
ఓవల్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి, ఇంగ్లండ్‌పై 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు, అతనికి నైట్‌వాచ్‌మ్యాన్ ఆకాశ్‌దీప్ సింగ్ తోడుగా ఉన్నాడు. అంతకుముందు, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ 224 పరుగుల వద్ద ముగిసింది.
పాంటింగ్ రికార్డును బ్రేక్ చేస్తాడా?
ఓవల్ పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు, కాబట్టి జో రూట్‌కు రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. అతను గనుక రెండో ఇన్నింగ్స్‌లో కూడా రాణిస్తే, టెస్ట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు అతని పేరు మీద నమోదు అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




