AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 4th Test: 55 ఏళ్ల తర్వాత భారత బ్యాటర్ల అరుదైన ఘనత..కేఎల్ రాహుల్, గిల్ రికార్డు!

కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో 174 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం 55 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. వీరిద్దరూ తమ సెంచరీలకు దగ్గరలో ఉన్నారు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడి జట్టును నిలబెట్టారు.

IND vs ENG 4th Test: 55 ఏళ్ల తర్వాత భారత బ్యాటర్ల అరుదైన ఘనత..కేఎల్ రాహుల్, గిల్  రికార్డు!
Ind Vs Eng 4th Test (1)
Rakesh
|

Updated on: Jul 27, 2025 | 9:40 AM

Share

IND vs ENG 4th Test:కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజున భారత జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. ఇంగ్లాండ్ 311 పరుగుల ఆధిక్యం సాధించగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, రాహుల్, గిల్ కలిసి 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను నిలబెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి గత 55 ఏళ్లలో జరగని ఒక పెద్ద రికార్డును సాధించారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్‌లో 500కి పైగా పరుగులు సాధించారు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 55 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ 1970-71లో ఇలా సాధించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల వెనుకబడిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చాలా దారుణంగా ఆడింది. క్రిస్ వోక్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికి యశస్వి జైస్వాల్(0), ఐదో బంతికి సాయి సుదర్శన్(0) లను ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత, నాలుగో రోజు ఆట ముగిసే వరకు రాహుల్, గిల్ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కేఎల్ రాహుల్ 210 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 167 బంతుల్లో 78 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో రోజు తమ సెంచరీలను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్‌ను గెలవడం ఇప్పుడు కష్టం, కానీ ఓటమిని తప్పించుకోవాలంటే ఈరోజు మంచి బ్యాటింగ్ చేయాలి.

ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అతని ముందు సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఈ సిరీస్‌లో తన మూడో సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. అతను మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీలు కొట్టాడు. అతను ఇప్పటివరకు 508 పరుగులు చేశాడు. అలాగే, భారత కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును శుభ్‌మన్ గిల్ 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరలో ఉన్నాడు. గిల్ ప్రస్తుతం 697 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ ఉన్నాడు. అతను 1978లో 732 పరుగులు చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో మరో 36 పరుగులు జోడిస్తే 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగలడు.

రాహుల్, గిల్ ఈరోజు మూడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను అధిగమించే అవకాశం ఉంది. మూడో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్. వీరు 2004లో 336 పరుగులు చేశారు. ఈ జాబితాలో ఐదో స్థానంలో టెండూల్కర్, గంగూలీ ఉన్నారు. వీరు 1996లో 255 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్, రాహుల్ ఆడిన తీరు చూస్తుంటే ఈ రోజు టెండూల్కర్, గంగూలీని అధిగమించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..