AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం హైకోర్టు జడ్జిలమని ఫోన్ కాల్స్.. ముగ్గురు నిందితుల అరెస్టు

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం పీఎంఓ, గవర్నర్ పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో కందుకూరుకు చెందిన అశోక్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం హైకోర్టు జడ్జిలమని ఫోన్ కాల్స్.. ముగ్గురు నిందితుల అరెస్టు
Ipl Ticket Scam
Rakesh
|

Updated on: May 04, 2026 | 12:55 PM

Share

IPL Ticket Scam : హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుంటే క్రికెట్ లవర్స్‎కు పండగే. కానీ ఇదే అదనుగా భావించి కొందరు కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. ఐపీఎల్ టికెట్ల కోసం ఏకంగా ప్రధాని కార్యాలయం (PMO), గవర్నర్ ఆఫీస్ పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి, ఉన్నతాధికారులమంటూ బిల్డప్ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యవర్గ సభ్యులకు గత కొన్ని రోజులుగా వింత ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము హైకోర్టు జడ్జిలమని, మరికొందరు తాము పీఎంఓ (PMO) నుంచి మాట్లాడుతున్నామని హుకుం జారీ చేస్తూ ఐపీఎల్ టికెట్లు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా, గవర్నర్ కార్యాలయం, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA), ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) లెటర్ హెడ్లతో కూడిన నకిలీ లేఖలను కూడా వాట్సాప్ ద్వారా పంపి టికెట్లు పొందాలని ప్రయత్నించారు.

హెచ్‌సీఏ అధికారుల అనుమానం

వరుసగా వస్తున్న ఈ సిఫార్సు లేఖలు, ఫోన్ కాల్స్ చూసి హెచ్‌సీఏ అధికారులకు ఎక్కడో తేడా కొట్టింది. సాధారణంగా ఇలాంటి కీలక కార్యాలయాల నుంచి ఇంత డైరెక్ట్‌గా టికెట్ల కోసం ఒత్తిడి రాదని భావించిన వారు.. వెంటనే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ బ్రాంచ్, ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు. టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ లేఖలు ఎవరు సృష్టించారు? అనే కోణంలో దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఠా గుట్టు రట్టు

ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన అశోక్ అని పోలీసులు గుర్తించారు. అశోక్‌తో పాటు అతని ప్రాంతానికే చెందిన మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రముఖుల పేర్లను వాడుకుంటే అధికారులు భయపడి టికెట్లు ఇస్తారని భావించి ఈ నకిలీ లేఖలను డిజిటల్ పద్ధతిలో సృష్టించినట్లు తేలింది. వీరి దగ్గరి నుంచి పలు నకిలీ లేఖలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక

ఐపీఎల్ సీజన్‌లో టికెట్ల కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. టికెట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని, నల్లబజారులో అమ్మేవారిని గానీ, ఇలాంటి సిఫార్సులతో మోసాలకు పాల్పడేవారిని గానీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us