AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాంచైజీల వల్ల కాలే.. హ్యాట్రిక్ ట్రోఫీలతో ఐపీఎల్ హిస్టరీని మార్చేసిన ముగ్గురు.. తోపులకే తోపులు వీళ్లు.!

Consecutive IPL Titles: క్రికెట్ ప్రపంచంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతేనే ఇలాంటి అరుదైన రికార్డులు సాధ్యమవుతాయి. ఐపీఎల్ లాంటి అత్యంత కఠినమైన లీగ్‌లో ఏకంగా మూడు విభిన్న సీజన్లలో వరుసగా చాంపియన్ జట్లలో సభ్యులుగా ఉండటం ఈ ముగ్గురు ఆటగాళ్లకు దక్కిన అరుదైన గౌరవమనే చెప్పాలి.

ఫ్రాంచైజీల వల్ల కాలే.. హ్యాట్రిక్ ట్రోఫీలతో ఐపీఎల్ హిస్టరీని మార్చేసిన ముగ్గురు.. తోపులకే తోపులు వీళ్లు.!
Consecutive Ipl Titles
Venkata Chari
|

Updated on: Jun 03, 2026 | 7:36 AM

Share

Consecutive IPL Titles: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా ఐపీఎల్ ఎదగడానికి ప్రధాన కారణం ఇక్కడి మెగా వేలం విధానమే. ఏ ఒక్క జట్టు కూడా లీగ్‌పై సుదీర్ఘకాలం పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటాయి. అందుకే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా వరుసగా మూడు సీజన్లలో ట్రోఫీని గెలవలేకపోయింది. కానీ, ముగ్గురు ఆటగాళ్లు మాత్రం వేర్వేరు జట్లలో ఉంటూ వరుసగా మూడు సార్లు టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.

లీగ్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు..

ఐపీఎల్‌లో నిలకడగా రాణించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో సరైన జట్టులో అవకాశం దక్కించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే మెగా వేలం వల్ల ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారడం సహజం. ఈ క్రమంలో జట్లు మారినా కూడా అదృష్టం మాత్రం మారకుండా, వరుసగా మూడు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్లలో సభ్యులుగా ఉన్న ముగ్గురు క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. కర్ణ్ శర్మ (2016 – 2018): ఐపీఎల్‌లో వరుసగా మూడుసార్లు టైటిల్ గెలిచిన ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందుగా గుర్తొచ్చే పేరు లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ. చాలా కాలం పాటు ఈ రికార్డు ఆయన పేరిట మాత్రమే ఉండేది. కర్ణ్ శర్మ అదృష్ట ప్రయాణం 2016లో ప్రారంభమైంది. ఆ ఏడాది డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్ టైటిల్ కైవసం చేసుకుంది.

ఆ మరుసటి ఏడాది, అంటే 2017లో కర్ణ్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులోకి మారాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఆనాటి ఫైనల్ పోరులో రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్‌ను ఓడించి ముంబై ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2018లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరాడు. రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై, మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో చాంపియన్‌గా నిలిచింది. అలా వరుసగా మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఆడి మూడు సార్లు ఐపీఎల్ కప్పును ముద్దాడిన మొదటి ఆటగాడిగా కర్ణ్ శర్మ నిలిచాడు.

2. ఫిల్ సాల్ట్ (2024 – 2026): కర్ణ్ శర్మ తర్వాత ఈ అరుదైన క్లబ్‌లో చేరిన రెండో ఆటగాడు ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్. ఈయన ప్రయాణం 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో మొదలైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ ఏడాది కేకేఆర్ పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తన మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఫిల్ సాల్ట్‌ను ఏకంగా 11.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించగా, సాల్ట్ ఆ చారిత్రాత్మక జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇక తాజాగా ముగిసిన 2026 సీజన్‌లోనూ ఆర్సీబీ తన టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకోవడంతో, ఫిల్ సాల్ట్ ఖాతాలో వరుసగా మూడో ఐపీఎల్ మెడల్ వచ్చి చేరింది.

3. సుయాష్ శర్మ (2024 – 2026): ఫిల్ సాల్ట్ బాటలోనే యువ స్పిన్నర్ సుయాష్ శర్మ కూడా వరుసగా మూడు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుని ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించాడు. చాలా తక్కువ కాలంలోనే తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ ఆటగాడు అదృష్టానికి మారుపేరుగా మారాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచినప్పుడు సుయాష్ ఆ జట్టులో ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆయనకు ఎక్కువ అవకాశాలు రాకపోయినప్పటికీ విజేత జట్టులో భాగమయ్యాడు.

ఆ తర్వాత జరిగిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఈ యువ స్పిన్నర్‌ను 2.60 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2025లో ఆర్సీబీ తన మొదటి కప్పును గెలిచినప్పుడు సుయాష్ జట్టు విజయాల్లో భాగస్వామి అయ్యాడు. ఇక 2026లో సైతం ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్‌గా అవతరించడంతో, సుయాష్ శర్మ కూడా తన కెరీర్‌లో వరుసగా మూడో ఐపీఎల్ చాంపియన్‌షిప్ మెడల్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us