Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీని కాపాడిన సర్ జడేజా.. రాజస్థాన్ రాయల్స్ ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే?

Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ కరువుపై మీడియా అడిగిన క్లిష్టమైన ప్రశ్న నుంచి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రవీంద్ర జడేజా కాపాడారు. రాజస్థాన్ జట్టు ఇప్పుడు ఫలాలను ఇచ్చే స్థాయికి చేరిందని జడ్డూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Vaibhav Sooryavanshi :  వైభవ్ సూర్యవంశీని కాపాడిన సర్ జడేజా.. రాజస్థాన్ రాయల్స్ ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే?
Vaibhav Sooryavanshi

Updated on: Mar 17, 2026 | 6:32 AM

Vaibhav Sooryavanshi : క్రికెట్ మైదానంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాట్ పట్టుకుంటే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోవాల్సిందే. ఎవరికీ భయపడని ఈ బీహార్ బుల్లోడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే, మైదానం బయట మీడియా వేసిన ఒక క్లిష్టమైన ప్రశ్న వైభవ్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పెద్దన్నలా ముందుకొచ్చి అతన్ని కాపాడటమే కాకుండా తనదైన శైలిలో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వైభవ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. “రాజస్థాన్ అంటే కరువు ప్రాంతం అని పేరు. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో మీరు ట్రోఫీ గెలిచారు, అప్పటి నుంచి మళ్ళీ ట్రోఫీ కరువు కొనసాగుతోంది.. మరి 2026లో అయినా రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా?” అని ఒక విలేకరి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న వైభవ్ వయసు కంటే చాలా పెద్దది కావడంతో అతను కాస్త తడబడ్డాడు. అసలే వైభవ్ పుట్టకముందే రాజస్థాన్ తన మొదటి ట్రోఫీని గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితిలో సమాధానం చెప్పడం వైభవ్‌కు కష్టమని గ్రహించిన జడేజా వెంటనే మైక్ అందుకున్నాడు.

జడేజా తనదైన శైలిలో స్పందిస్తూ.. “రాజస్థాన్‌లో ట్రోఫీ కరువు ఉందని మీరు అంటున్నారు కానీ, ఇప్పుడు అక్కడ అంతా హరితవనం (పచ్చదనం) కనిపిస్తోంది. అలా కరువు అని అనకండి, చాలా చోట్ల పచ్చదనం ఉంది. ఏదైనా మొక్క పెరిగి పెద్దవ్వడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఆ మొక్క పెద్దదై వృక్షంగా మారింది. ఇక పండ్లు (ఫలితాలు) వచ్చే సమయం ఆసన్నమైంది” అని చాలా చాకచక్యంగా సమాధానం ఇచ్చాడు. అంటే రాజస్థాన్ జట్టు ఇప్పుడు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ఈసారి ట్రోఫీ ఖాయమనే అర్థం వచ్చేలా జడ్డూ మాట్లాడటం విశేషం.

వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో ఐపీఎల్ సీజన్. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు, తన బ్యాటింగ్‌తోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ల దగ్గర మెలకువలు నేర్చుకోవడంలోనూ ముందున్నాడు. ముఖ్యంగా జడేజా వంటి దిగ్గజాలు అండగా ఉండటంతో ఈసారి వైభవ్ తన బ్యాట్‌తోనే కాకుండా మానసికంగా కూడా మరింత బలంగా మారే అవకాశం ఉంది. మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ తో రాజస్థాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us