IPL 2026 : ఆ ఒక్క చోటు కోసం 7 జట్ల పోరాటం.. ఎస్ఆర్‌హెచ్‌కు 75% ఛాన్స్.. డేంజర్ జోన్‌లో పంజాబ్ కింగ్స్!
IPL 2026 : ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది. ఎస్ఆర్‌హెచ్‌కు 75%, సీఎస్‌కేకు 35.5% అవకాశాలు ఉండగా, ఢిల్లీ గెలుపుతో పంజాబ్ కింగ్స్ అవకాశాలు తగ్గాయి. ఢిల్లీపై ఓటమిని రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపుకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ (RR)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సాధించిన అద్భుత విజయం పాయింట్ల పట్టికలో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతం కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాత్రమే అధికారికంగా క్వాలిఫై అవ్వగా, మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజా గణాంకాల ప్రకారం.. ఏ జట్టుకు ఎన్ని శాతం అవకాశాలు ఉన్నాయో చూస్తే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
టాప్-3 లో గట్టి పోటీ
ఆర్సీబీ తర్వాత ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టు గుజరాత్ టైటాన్స్ (GT). కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, గుజరాత్ 99.2 శాతం క్వాలిఫికేషన్ ప్రాబబిలిటీతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 75 శాతం అవకాశాలతో మూడో స్థానంలో పటిష్టంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఈ జట్టు తన తర్వాతి మ్యాచుల్లో విజయం సాధిస్తే సులువుగా నాకౌట్ చేరుకుంటుంది.
ఆ నాలుగో స్థానం ఎవరిది?
అసలు సిసలైన పోరాటం నాలుగో స్థానం కోసమే జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 35.5 శాతం అవకాశాలు ఉండగా, రాజస్థాన్ రాయల్స్ (RR) 34.8 శాతంతో అతి సమీపంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోవడం వల్ల వారి అవకాశాలు దెబ్బతిన్నాయి. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ (PBKS) ప్రస్తుతం టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, వారి క్వాలిఫికేషన్ ఛాన్స్ మాత్రం 31.1 శాతంగానే ఉండటం గమనార్హం. పంజాబ్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుండటమే దీనికి ప్రధాన కారణం.
ఢిల్లీకి కొత్త ఆశలు.. కేకేఆర్ పరిస్థితి ఏంటి?
రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కు ప్లేఆఫ్స్ ఆశలు మళ్ళీ చిగురించాయి. ప్రస్తుతం వారి అవకాశాలు 10.6 శాతానికి పెరిగాయి. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుస వైఫల్యాలతో 13.9 శాతానికి పడిపోయింది. ఢిల్లీ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (51), కెప్టెన్ కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించడంతో పాటు, మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగడం ఢిల్లీకి ప్లస్ అయ్యింది.
రాజస్థాన్ రాయల్స్‌లో అంతర్గత అసమ్మతి
ఢిల్లీపై ఓటమిని రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన టీమ్ మేట్స్‌పై పరాగ్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత తన సహచర ఆటగాళ్ల ప్రదర్శనపై పరాగ్ నిప్పులు చెరగడం జట్టులో ఉన్న ఒత్తిడిని సూచిస్తోంది. రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. లీగ్ చివరి వారం కావడంతో ప్రతి మ్యాచ్ ఇప్పుడు ఫైనల్‌ను తలపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
