RCB vs SRH: చిన్నస్వామి స్టేడియంలో హైడ్రామా.. కోచ్ సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆర్సీబీ డేంజరస్ బౌలర్
RCB vs SRH: ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న దేవదత్ పడిక్కల్ ఒక బంతిని చాలా బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా బుల్లెట్‌లా హేజిల్‌వుడ్ వైపు దూసుకొస్తుండడంతో అక్కడే ఉన్న స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ ఫిజియో అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

RCB vs SRH: ఐపీఎల్ 2026 (IPL 2026) సమరానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందే ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో జరిగిన ఈ ఘటనతో అటు మేనేజ్మెంట్, ఇటు అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్ సెషన్‌లో ఒక భయానక దృశ్యం కనిపించింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటికే హ్యామ్‌స్ట్రింగ్, అకిలెస్ టెండన్ గాయాల నుంచి కోలుకుంటున్నాడు. దీనివల్ల అతను నేటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే ఫిట్‌నెస్ కోసం గ్రౌండ్ ఒక మూలన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తున్న సమయంలో, నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న దేవదత్ పడిక్కల్ ఒక బంతిని చాలా బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా బుల్లెట్‌లా దూసుకువచ్చి హేజిల్‌వుడ్ తలకు తగిలేలా ఉంది. కానీ అక్కడే ఉన్న స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ ఫిజియో అప్రమత్తంగా వ్యవహరించి హేజిల్‌వుడ్‌ను పక్కకు నెట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ అప్‌డేట్
జోష్ హేజిల్‌వుడ్ గత కొన్ని నెలలుగా వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కల్లా అతను ఫిట్ అవుతాడని భావించినా, ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కనీసం మొదటి రెండు మ్యాచులకు అతను అందుబాటులో ఉండడని కోచ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హేజిల్‌వుడ్ కేవలం తేలికపాటి శిక్షణ మాత్రమే పొందుతున్నాడు. ఇలాంటి సమయంలో మళ్ళీ గాయం తగిలి ఉంటే, అతను టోర్నీ మొత్తానికే దూరం అయ్యే అవకాశం ఉండేది.
View this post on Instagram
ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఆందోళన
ఈ సీజన్‌లో ఆర్సీబీకి బౌలింగ్ విభాగంలో ఇప్పటికే సమస్యలు ఉన్నాయి. యశ్ దయాల్ వంటి కీలక బౌలర్లు దూరం కావడంతో, హేజిల్‌వుడ్ ఎప్పుడు జట్టులోకి వస్తాడా అని టీమ్ మేనేజ్‌మెంట్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఈ రోజు జరిగిన ఘటనతో భవిష్యత్తులో ప్రాక్టీస్ సెషన్ల సమయంలో బౌలర్లు, బ్యాటర్ల మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ, హేజిల్‌వుడ్ లేని లోటును భువనేశ్వర్ కుమార్, సుయశ్ శర్మలతో భర్తీ చేయాలని చూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
