IPL 2026 Alert : ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ పోరులో 25 ఫోన్లు మాయం… ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా? జర భద్రం
IPL 2026 Alert : ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల జోరు పెరిగింది కానీ, స్టేడియాలకు వెళ్లే అభిమానులకు మాత్రం ఫోన్ల దొంగల భయం పట్టుకుంది. మొన్న శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన పోరులో రికార్డుల కంటే ఫోన్ల చోరీలే హాట్ టాపిక్ అయ్యాయి. సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.

IPL 2026 Alert : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ చూడటానికి వచ్చిన కనీసం 25 మంది తమ ఫోన్లను పోగొట్టుకున్నారు. అయితే, ఈ ఫోన్లన్నీ స్టేడియం లోపలే పోయాయా లేక బయట గుంపులో ఉండగా చోరీకి గురయ్యాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా మైనర్లు కావడం గమనార్హం. వీరు ఏదైనా పెద్ద ముఠాకు చెందినవారా లేక కేవలం అనుమానంతో పట్టుకున్నారా అన్నది తేలాల్సి ఉంది.
ఈ దొంగతనానికి గురైన వారిలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ రీతూ తివారీ భర్త కూడా ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. “నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను.. ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లేటప్పుడు మీ ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం పీ3 స్టాండ్ నుంచే దాదాపు 50 నుంచి 60 ఫోన్లు మాయమయ్యాయి. మొదటి ఇన్నింగ్స్ తర్వాత నా భర్త నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తన ఫోన్ ఎవరో కొట్టేశారు. పోలీసులను అడిగితే వారు పెద్దగా పట్టించుకోలేదు, కానీ స్టేషన్ కు వెళ్తే అప్పటికే చాలా మంది ఇదే ఫిర్యాదుతో అక్కడ ఉన్నారు” అని ఆమె పేర్కొన్నారు.
నిందితులు జెర్సీలు వేసుకుని వస్తున్నారా?
స్టేషన్ లో పోలీసులు పట్టుకున్న 10 నుంచి 12 మంది పిల్లలంతా జెర్సీలు వేసుకుని, కాంప్లిమెంటరీ టిక్కెట్లు పట్టుకుని ఉన్నారని రీతూ ఆరోపించారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అనిపిస్తోందని, చెన్నై, వాంఖడే స్టేడియాల్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో జనం రిఫ్రెష్‌మెంట్స్ కోసం బయటకు వచ్చినప్పుడే ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెక్యూరిటీని పెంచాలని ఆమె కోరారు.
Beware Cricket fans ⚠️ 🚨
Listen to this lady and This shouldn’t go unheard because it’s such an organised crime where so many phone’s were stolen and it’s such a breach of trust & security. She requested Bangalore Police to take strict action against this and get hold of the… pic.twitter.com/MJXrlsaoHd
— Karnataka Portfolio (@karnatakaportf) March 30, 2026
పోలీసులు ఏమన్నారంటే
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) సి.వంశీ కృష్ణ మాట్లాడుతూ, ఫోన్లన్నీ స్టేడియం లోపలే పోయాయని అనడం సరికాదన్నారు. జనం ఫోన్ పోయిందని గుర్తించే సమయానికి లోపల ఉండవచ్చు, కానీ అది బయటే ఎక్కడో పోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానితులైన మైనర్లను రిఫార్మేషన్ సెంటర్‌లో ఉంచామని, నిందితులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియం లోపలికి టిక్కెట్ లేకుండా ఎవరినీ పంపలేదని, కాబట్టి లోపల దొంగతనం చేసే అవకాశం తక్కువని వారు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
