టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ అనడం కన్నా భక్తులు అనడం బెటరేమో!. ఎందుకంటే వీళ్లలో చాలా మంది ధోనీని దేవుడిలా ఆరాధిస్తారు. ధోనీపై ఉన్న అభిమానం వాళ్లని తిన్నగా ఉండనివ్వడం లేదు. సెక్యూరిటీని లెక్కచేయకుండా మైదానంలోకి వెళ్లి ధోనీని కౌగిలించుకోవడమో.. లేదా కాళ్లకు మొక్కేలా చేయడమో చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
ఛేదనలో చివరి వరకు క్రీజ్ లో ఉండి చెన్నై జట్టుకు ధోనీ విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో బ్రేవో ఫోర్ బాది మ్యాచ్ ను ముగించడంతో.. ధోనీ, బ్రేవోలు సహచర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా ఒకరు, మ్యాచ్ పూర్తయ్యాక ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుండగా మరో అభిమాని వచ్చి ధోనీ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఒకరు ధోనీ కాళ్లను తాకగా.. మరొకరు తన చేతులతో ధోనీ కాళ్లను చుట్టేశాడు. అనంతరం ధోనీ తన అభిమానులకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి వారిని మైదానం బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.