WCL 2025 : అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్
క్రికెట్ లెజెండ్స్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో ఇండియా ఛాంపియన్స్ అదరగొట్టింది! ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి, సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపులో స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ మెరుపు బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించారు.

WCL 2025 : ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీసెస్టర్‌లోని గ్రేస్ గ్రౌండ్ మైదానంలో జరిగిన ఈ కీలకమైన 15వ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్‌గా వచ్చిన క్రిస్ గేల్ కేవలం 9 పరుగులు చేసి అవుట్ అవ్వగా, లిండ్ల్ సిమన్స్ 2 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన చాడ్విక్ వాల్టన్ (0), పెర్కిన్స్ (0) డకౌట్ అయ్యారు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ మాత్రం తనదైన స్టైల్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. భారత బౌలర్లను చితకబాదుతూ పొలార్డ్ 43 బంతుల్లో 8 సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. 145 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ జట్టుకు కూడా సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రాబిన్ ఉత్తప్ప (8), శిఖర్ ధావన్ (25) త్వరగా అవుటయ్యారు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన గుర్కీరత్ మన్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు.
దీని వెంటే సురేష్ రైనా (7) కూడా వికెట్ కోల్పోయాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 21 బంతుల్లో అజేయంగా 50 పరుగులు సాధించాడు. బిన్నీకి మంచి తోడుగా నిలిచిన యువరాజ్ సింగ్ 11 బంతుల్లో 21 పరుగులు చేయగా, యూసుఫ్ పఠాన్ కేవలం 7 బంతుల్లో 21 పరుగులు బాదాడు. దీంతో ఇండియా ఛాంపియన్స్ జట్టు 13.2 ఓవర్లలోనే 148 పరుగులు సాధించి, 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్‌కు చేరడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే, అంతకుముందు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఇండియా ఒకవైపు ఉండగా, ఒక మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టుకు కూడా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉండేది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఇండియా ఛాంపియన్స్ జట్టు, నెట్ రన్ రేట్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌ను అధిగమించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
జట్ల వివరాలు:
ఇండియా ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: రాబిన్ ఉత్తప్ప (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ (కెప్టెన్), యూసుఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, అభిమన్యు మిథున్, వరుణ్ ఆరోన్, పవన్ నేగి, గుర్కీరత్ సింగ్ మాన్.
వెస్టిండీస్ ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: క్రిస్ గేల్ (కెప్టెన్), చాడ్విక్ వాల్టన్ (వికెట్ కీపర్), డ్వేన్ స్మిత్, లెండ్ల్ సిమ్మన్స్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆష్లే నర్స్, విలియం పెర్కిన్స్, షెల్డన్ కాట్రెల్, డేవ్ మొహమ్మద్, నికితా మిల్లర్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




