India vs Ireland: సత్తాచాటిన దీపక్‌, చాహల్‌.. మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..

| Edited By: Ravi Kiran

Jun 27, 2022 | 6:21 AM

India vs Ireland 1st T20 Match: ఐర్లాండ్‌ పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. మొదటిసారిగా భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన ఆల్‌రౌండ్ కెప్టెన్సీతో ..

India vs Ireland: సత్తాచాటిన దీపక్‌, చాహల్‌.. మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..
Indian Cricket Team
Follow us on

India vs Ireland 1st T20 Match: ఐర్లాండ్‌ పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. మొదటిసారిగా భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన ఆల్‌రౌండ్ కెప్టెన్సీతో ఘనంగా అరంగేట్రం చేశాడు. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్ (India vs Ireland)ని ఓడించింది. మొదట యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఐర్లాండ్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత దీపక్‌ హుడా, ఇషాన్‌ కిషన్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్‌ స్ఫూర్తిదాయకవిజయం సాధించింది. తద్వారా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సిరీస్‌లో రెండో మ్యాచ్‌ రేపు (జూన్‌28) ఇదే మైదానంలో జరగనుంది.

డబ్లిన్‌లోని మలాహిడ్‌లో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు సత్తాచాటడంతో ఐర్లాండ్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అతని చలవతోనే 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది ఐర్లాండ్‌. టీమిండియా బౌలర్లలో యుజువేంద్రా చాహల్‌ (11/1), భువనేశ్వర్‌ (16/1) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన స్పీడ్‌స్టర్‌ ఒక ఓవర్‌ మాత్రమే వేసి 14 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలో 111 పరుగులు చేసి విజయం సాధించింది. దీపక్‌ హుడా ( 29 బంతుల్లో 47, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ ( 11 బంతుల్లో 26), హార్దిక్‌ పాండ్య (24) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దినేశ్‌ కార్తిక్‌ 5 నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌ను కట్టడి చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన యుజువేంద్ర చాహల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..