India vs Bangladesh 2026 : బంగ్లా గడ్డపై టీమిండియా దండయాత్ర..సెప్టెంబర్‌లో 6 మ్యాచ్‌ల సమరం
India vs Bangladesh 2026 : సోషల్ మీడియాలో బంగ్లాదేశీ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో, షారుఖ్ ఖాన్ జట్టు భారీ ధర చెల్లించడంపై రాజకీయ ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఎలాంటి నిషేధం లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

India vs Bangladesh 2026 : ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో ఒకవైపు ఐపీఎల్ 2026 సందడి నెలకొంటే, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గత ఏడాది కాలంగా అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో, టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన ఖరారు కావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. జనవరి 2న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన 2026 క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ నెలలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం జరగనుంది.
సెప్టెంబర్‌లో షెడ్యూల్ ఇదే
బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, భారత జట్టు సెప్టెంబర్ మొదటి వారంలోనే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
వన్డే సిరీస్: సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో జరుగుతుంది.
టీ20 సిరీస్: సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జరగబోయే ముఖ్యమైన ఐసీసీ టోర్నీలకు ముందు ఈ వైట్ బాల్ సిరీస్ భారత్‌కు ఒక మంచి ప్రాక్టీస్‌లా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఐపీఎల్ 2026 వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.9.2 కోట్లకు కొనుగోలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో బంగ్లాదేశీ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో, షారుఖ్ ఖాన్ జట్టు భారీ ధర చెల్లించడంపై రాజకీయ ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఎలాంటి నిషేధం లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య టీమిండియా అక్కడికి వెళ్లడం అంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
భారత జట్టు చివరిసారిగా 2022-23లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పుడు వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. అప్పట్లో మెహిదీ హసన్ మీరాజ్ వీరోచిత పోరాటంతో భారత్‌కు షాక్ ఇచ్చాడు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే బంగ్లా గడ్డపై ఓవరాల్ రికార్డు చూస్తే భారత్‌దే పైచేయి. అక్కడ ఆడిన 25 వన్డేల్లో భారత్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గతంలో అక్కడ భారత్ ఆధిపత్యం చలాయించినప్పటికీ, ఇటీవల బంగ్లాదేశ్ తన సొంత గడ్డపై బలమైన జట్టుగా ఎదిగింది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వివాదాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ ప్రచారాల వల్ల ఈ సిరీస్‌కు భద్రత అతిపెద్ద సవాలుగా మారనుంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. ఇలాంటి సమయంలో మ్యాచ్‌లు జరిగితే స్టేడియంలో వాతావరణం ఎలా ఉంటుందోనని క్రీడా పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ 6 మ్యాచ్‌ల పర్యటనలో భారత్ తన సత్తా చాటుతుందా లేదా బంగ్లాదేశ్ మళ్ళీ షాక్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి.
