Ind Vs Ban : భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా.. ఆగస్టులో జరగాల్సిన సిరీస్ రద్దు.. మళ్లీ ఎప్పుడంటే ?
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆగస్టు 2025లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ వైట్-బాల్ సిరీస్ సెప్టెంబర్ 2026కి వాయిదా పడింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే రీఎంట్రీ కోసం అభిమానులు మరింత కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

Ind Vs Ban : క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మధ్య వైట్-బాల్ సిరీస్ వాయిదా పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ పరస్పర అంగీకారంతో ఈ సిరీస్‌ను ఆగస్టు 2025 నుంచి సెప్టెంబర్ 2026కి వాయిదా వేసినట్లు ప్రకటించాయి. వాస్తవానికి ఆగస్టు 17 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే భారత ప్రభుత్వం బీసీసీఐకి ఈ పర్యటనతో ముందుకు వెళ్లవద్దని సలహా ఇచ్చినట్లు గతంలో ఇండియా టుడే నివేదించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సిరీస్‌పై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. “ఇరు బోర్డుల మధ్య చర్చల తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, జట్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. పర్యటనకు సంబంధించి సవరించిన తేదీలు, మ్యాచ్‌ల వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధిత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మే 17న భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకునే రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో సహా పలు వస్తువులపై ప్రధాన దిగుమతి మార్గ ఆంక్షలను ప్రకటించింది.ఈశాన్య ప్రాంతంలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల ద్వారా రెడీమేడ్ గార్మెంట్స్ ఉత్పత్తులను భారతదేశంలోకి అనుమతించరు. బంగ్లాదేశ్ ఏప్రిల్‌లో విధించిన ఇలాంటి ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చూస్తున్నారు.
రోహిత్-విరాట్ జోడీ కోసం ఎదురుచూపులు! ఐకానిక్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడాన్ని చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే, వారు టీ20 అంతర్జాతీయ, టెస్ట్ క్రికెట్‌ల నుండి రిటైర్ అయిన తర్వాత కేవలం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించారు. 2027 ప్రపంచ కప్ వారి టార్గెట్. వాస్తవానికి, ఆగస్టు 2025లో జరగాల్సిన ఈ వైట్-బాల్ సిరీసుతో వారి రీఎంటీ ఇస్తారని భావించారు. కానీ, సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 2026కి వాయిదా పడటంతో ‘రో-కో’ మ్యాజిక్‌ను మళ్లీ చూడటానికి అభిమానులు మరింత ఓపిక పట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడుతోంది. ఇది ఆగస్టు 4 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత బంగ్లాదేశ్‌కు పరిమిత ఓవర్ల పర్యటన షెడ్యూల్ చేయబడింది.అసలు షెడ్యూల్ ప్రకారం, భారత్-బంగ్లాదేశ్ సిరీస్ ఆగస్టు 17న మూడు వన్డేలతో మొదలై, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో కొనసాగాల్సి ఉంది. అయితే, ఈ పర్యటన ఇప్పుడు సెప్టెంబర్ 2026కి వాయిదా పడటంతో ఆ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేస్తారు.
భారత్, బంగ్లాదేశ్ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడ్డాయి. అక్కడ భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు చివరిసారిగా 2024లో భారతదేశంలో ద్విపక్ష సిరీస్ ఆడాయి. ఇందులో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్ రెండు సిరీస్‌లను వరుసగా 2-0, 3-0 తేడాతో గెలుచుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..