IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు విజయం నీదా నాదా అనే రేంజ్‌లో మ్యాచ్ కొనసాగింది. ఒక దశలో భారత్ గెలుస్తుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా భారత్ ఆలౌట్ అయింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది.
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెఎల్ రాహుల్ 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు బాధ్యతని భుజాలపై మోస్తూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 61 పరుగులు (73 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ 65 పరుగులు (84 బంతుల్లో 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. వీరి తర్వాత మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు పర్వాలేదనిపించినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
చివరగా దీపక్ చాహర్ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. బుమ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కి 28 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంచుమించు భారత్‌ని విజయతీరాలవరకు చేర్చాడు. కానీ చివరలో ఔట్ కావడంతో మ్యాచ్ సౌతాఫ్రికా వైపు మళ్లింది. చివరి ఓవర్లో 7 బంతుల్లో 6 పరుగులు కావాలి. కానీ యజ్వేంద్ర చాహల్ అవుట్ కావడంతో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 3, లుంగి ఎంగిడి3, ప్రిటోరియా 2, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల1 వికెట్ చొప్పున సాధించారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జానెమన్ మలన్ చాహర్ బౌలింగ్‌లో1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత టెంబా బావుమాని రాహుల్ రనౌట్ చేశాడు. మార్‌క్రమ్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో భారమంతా క్వింటన్ డి కాక్, రస్పెన్ వాన్ డస్సెన్ పై పడింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కి సెంచరీ పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే డి కాక్ సెంచరీ పూర్తి చేశాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. డస్సెన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. వీరిద్దరు ఔట్ అయ్యాక ఎవ్వరు పెద్దగా రణించలేదు. చివరలో ఒక్క డేవిడ్ మిల్లర్ 39 పరుగులతో (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, బుమ్రా 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.