AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs AUS W : 10 ఏళ్ల తర్వాత అద్భుతం.. సొంత గడ్డపైనే ఆస్ట్రేలియాను మట్టికరిపించిన హర్మన్ సేన

IND W vs AUS W : ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్ద కాలంగా ఊరిస్తున్న నిరీక్షణకు తెరదించుతూ.. కంగారూ కోటలో టీమిండియా జయభేరి మోగించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు, ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

IND W vs AUS W : 10 ఏళ్ల తర్వాత అద్భుతం.. సొంత గడ్డపైనే ఆస్ట్రేలియాను మట్టికరిపించిన  హర్మన్ సేన
Ind W Vs Aus W
Rakesh
|

Updated on: Feb 21, 2026 | 6:38 PM

Share

IND W vs AUS W : ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్ద కాలంగా ఊరిస్తున్న నిరీక్షణకు తెరదించుతూ.. కంగారూ కోటలో టీమిండియా జయభేరి మోగించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు, ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. 2016 తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అడిలైడ్‌లో జరిగిన ఈ పోరులో స్మృతి మంధాన తన బ్యాటింగ్‌తో చెలరేగగా, యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

శనివారం (ఫిబ్రవరి 21) జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ షెఫాలీ వర్మ త్వరగానే అవుట్ అయినా, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధాన కేవలం 55 బంతుల్లో 82 పరుగులు చేయగా, జెమిమా 59 పరుగులతో రాణించింది. వీరిద్దరి వీరవిహారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టింది.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం అదిరిపోయింది. మొదటి ఓవర్లోనే 18 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లేలా కనిపించింది. అయితే రెండో ఓవర్లోనే సీన్ మారింది. యువ సంచలనం శ్రేయాంక పాటిల్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా ఓపెనర్లను కట్టడి చేసింది. చూస్తుండగానే 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఆసిస్ కష్టాల్లో పడింది. ఆష్లీ గార్డనర్ (57) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీ చరణి (3/32) ధాటికి ఆస్ట్రేలియా 159 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో కేవలం సిరీస్ మాత్రమే కాదు, మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో కూడా భారత్ 4-2 ఆధిక్యంలోకి వెళ్ళింది. 2017 తర్వాత ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్ ఓడిపోలేదు. అలాంటి రికార్డును భారత్ ఇప్పుడు బద్దలు కొట్టింది. 10 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై టీ20 సిరీస్ గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ జోష్‌తోనే భారత జట్టు త్వరలో జరగనున్న వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. వచ్చే మహిళా టీ20 వరల్డ్ కప్ 2026కు ఈ గెలుపు ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us