IND vs SA T20 Series: టీ20ల్లో సరికొత్త రికార్డ్‌కు చేరువైన భారత బౌలర్.. ఒక్క వికెట్ దూరంలోనే.. అదేంటంటే?
రెండో టీ20లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంత అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీం ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
టీమిండియా-దక్షిణాఫ్రికా(IND vs SA) జట్ల మధ్య టీ20 సిరీస్(T20 Series)లో భాగంగా విశాఖపట్నం వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత జట్టు(Team India)కు ఈ మ్యాచ్‌లో విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే రిషబ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మూడు విభాగాల్లోనూ అద్భుత ఆటను ప్రదర్శించాల్సి ఉంది.
మూడో టీ20 మ్యాచ్‌లో అభిమానుల కళ్లు గొప్ప రికార్డుకు చేరువలో ఉన్న భువనేశ్వర్ కుమార్‌పైనే ఉండబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ ఓ వికెట్ తీస్తే టీ20 ఇంటర్నేషనల్స్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం భువీ వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రీ, కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
పవర్‌ప్లే (T20Iలు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
- శామ్యూల్ బద్రీ – 50 ఇన్నింగ్స్‌లు 33 వికెట్లు
- భువనేశ్వర్ కుమార్ – 59 ఇన్నింగ్స్‌లు 33 వికెట్లు
- టిమ్ సౌథీ – 68 ఇన్నింగ్స్‌లు 33 వికెట్లు
- షకీబ్ అల్ హసన్ – 58 ఇన్నింగ్స్‌లు 27 వికెట్లు
- జోష్ హేజిల్‌వుడ్ – 30 ఇన్నింగ్స్‌లు 26 వికెట్లు
రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన..
రెండో టీ20లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంత గొప్ప ప్రదర్శన చేసినా టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ భువనేశ్వర్ కుమార్ రాణిస్తాడని భావిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 267 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 63 వికెట్లు, వన్డేల్లో 141 వికెట్లు, టీ20ల్లో 67 వికెట్లు తీశాడు.