Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు

Rahane and Pujara: వచ్చే ఏడాదిలో భారత జట్టు విదేశాల్లో కేవలం 3 టెస్టులు, సొంతగడ్డపై 6 టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి మిడిల్ ఆర్డర్‌లో మార్పుకు ఇది మంచి సమయం అంటోన్న మాజీలు.

IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు
India Vs Sa; Pujara And Rahane
Follow us
Venkata Chari

|

Updated on: Jan 13, 2022 | 5:04 PM

Ajinkya Rahane-Cheteshwar Pujara: భారత్- దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ కేప్‌టౌన్‌లో జరుగుతోంది. తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దక్షిణాఫ్రికా చేరుకున్న భారత జట్టు.. సెంచూరియన్‌లో విజయంతో శుభారంభం చేయగా, జోహన్నెస్‌బర్గ్ టెస్టులో ఓటమి చవిచూసి సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేప్‌టౌన్‌(Cape Town Test)లో సిరీస్‌ని నిర్ణయించి ఇక్కడ గెలుపొందాలని టీమిండియా ప్లాన్ చేసింది. కానీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అది జరగలేదు. ముఖ్యంగా జట్టులోని ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు, ఛెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara), అజింక్యా రహానే(Ajinkya Rahane)లపై ఎక్కువగా దృష్టి సారించారు. అయితే సిరీస్ చివరి ఇన్నింగ్స్‌లో నిరాశాజనక బ్యాటింగ్‌తో, వారి ఇద్దరి కెరీర్‌లకు తెర పడిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీల ఫామ్ అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో రహానే, పుజారా ఆడటంపై కూడా ప్రశ్నలు వచ్చాయి. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్‌లు మినహా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేప్ టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ, సిరీస్‌లోని చివరి ఇన్నింగ్స్‌లోనూ పుజారా 9, రహానే కేవలం 1 పరుగులకే ఔటయ్యారు. అటువంటి పరిస్థితిలో, ఈ సిరీస్‌లో వీరిద్దరి గణాంకాలను చూడటం చాలా అవసరం. దీని కారణంగా వారి కెరీర్ పురోగతి సాధిస్తుందా లేదా ఇక్కడితోనే ఆగిపోతుందా అనేది తెలియనుంది.

పుజారా వైఫల్యం.. పుజారా టీమిండియాలో నంబర్ త్రీ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ సిరీస్‌లో చాలా పేలవంగా ప్రారంభించాడు. సెంచూరియన్ తొలి ఇన్నింగ్స్‌లో అతను మొదటి బంతికే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత జోహన్నెస్‌బర్గ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలిచినా 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకుని పోరాడుతూ 53 పరుగులు చేశాడు. అలాగే రహానేతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత చివరి టెస్టులో కూడా పుజారా తొలి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడినా పెద్దగా స్కోర్ చేయలేక 43 పరుగులకే ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే అవుటయ్యాడు. ఈ విధంగా, పుజారా 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20.6 సగటుతో 124 పరుగులు చేశాడు.

రహానే కూడా అదే దారిలో.. అదే సమయంలో, పుజారా కంటే ఎక్కువ వివాదం రహానెను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడం గురించే జరిగింది. రహానే కూడా సిరీస్‌లోని మొత్తం 6 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని గణాంకాలు పుజారా కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. సెంచూరియన్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే వేగంగా 48 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మంచి స్కోరు సాధించేందుకు సహాయపడింది. తర్వాత ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే ఔటయ్యాడు. అదే సమయంలో, జోహన్నెస్‌బర్గ్‌లో, పుజారా తర్వాత మొదటి బంతికి పెవిలియన్ చేర్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో పుజారాతో భాగస్వామ్యంతో 58 పరుగులు చేశాడు. కేప్ టౌన్‌‌లో కగిసో రబాడ చేసిన అద్భుతమైన డెలివరీలకు బలి అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రహానే స్కోర్లు 9, 1 పరుగుగా నిలిచింది. అంటే 6 ఇన్నింగ్స్‌ల్లో రహానే 22.6 సగటుతో 136 పరుగులు మాత్రమే చేశాడు.

మార్పు కోసం ఇదో అవకాశం..! దాదాపు పదేళ్లుగా టీమిండియా మిడిలార్డర్‌కు ఎంతో అండగా నిలిచిన ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు.. గత రెండేళ్లుగా దారుణంగా మారింది. ఈ సమయంలో వీరిద్దరి సగటు 30కి దిగువన ఉండడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. వీరిద్దరినీ దక్షిణాఫ్రికాలో ప్లేయింగ్ XIలో ఉంచడానికి ప్రధాన కారణం ఈ పరిస్థితుల్లో వారి అనుభవమే. ప్రస్తుతం టీం ఇండియా డబ్ల్యూటీసీలో భాగంగా విదేశాల్లో 3 టెస్టులు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి ఇంగ్లాండ్‌లో, రెండు బంగ్లాదేశ్‌లో ఆడాల్సి ఉంది. అంతకుముందు శ్రీలంకతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత ప్రదర్శనను చూస్తుంటే, వీరిద్దరికీ జట్టులో స్థానం లభించవచ్చు. కానీ, ప్లేయింగ్ XIలో చోటు దక్కడం మాత్రం కష్టంగా మారే ఛాన్స్‌ ఉంది. అయితే మిడిలార్డల్‌లో మార్పులు చేయాలంటే ఇదే మంచి అవకాశం అని మాజీలు కూడా అంటున్నారు.

Also Read: IND vs SA: విరాట్ కోహ్లీకి ప్రత్యేక హోదా తెచ్చిన భారత పేస్ బౌలర్లు.. అదేంటో తెలుసా?

Watch Video: వాట్ ఏ క్యాచ్.. షాకైన పుజారా.. చిరుత లాంటి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికా ప్లేయర్..!