AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రద్దయితే అభిమానులకు నిరాశ తప్పదు. మ్యాచ్ నిర్వహణకు ఐసీసీ కృషి చేసినా, వర్షం కారణంగా ఐదు ఓవర్లు కూడా పూర్తి కాకపోతే ఇరు జట్లకు..

IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే
Ind Vs Pak
Ravi Kiran
|

Updated on: Feb 15, 2026 | 12:58 PM

Share

టీ20 వరల్డ్‌కప్ 2026లో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు పెద్ద పండగే. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోవడం, నినాదాలతో దద్దరిల్లిపోవడం సాధారణం. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మొదటి నుంచే ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద హైడ్రామా సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మీటింగ్స్ తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చివరకు ఆడటానికి అంగీకరించింది. ఐసీసీ అధికారులు లాహోర్‌కు వెళ్లి చర్చలు జరిపి, మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి చాలా కృషి చేశారు.

అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే వర్షం ముప్పు. తాజా వాతావరణ అంచనాల ప్రకారం, మ్యాచ్ జరిగే అవకాశాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ నిపుణుల సూచనల ప్రకారం, పగటి సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని, చినుకులు మాత్రమే కాదు మెరుపులతో కూడిన వాన కూడా కురిసే అవకాశం ఉందని సమాచారం. రాత్రికి వర్షం అవకాశాలు 25 శాతంకి తగ్గుతాయని చెబుతున్నా, సాయంత్రం 7 గంటల సమయంలో మళ్లీ 70 శాతం వర్షం పడే అవకాశం ఉందని కొన్ని స్థానిక అంచనాలు సూచిస్తున్నాయి. గంటకు సుమారు 11 మైళ్ల వేగంతో ఉత్తర దిశ నుంచి గాలి వీయనుంది. వాతావరణం మొత్తం తేమగా ఉండే అవకాశం ఉంది.

ఈ వర్షం వార్తల నేపథ్యంలో, మ్యాచ్ పూర్తిగా రద్దు అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. టీ20 మ్యాచ్‌కు ఫలితం రావాలంటే ప్రతి జట్టు కనీసం ఐదు ఓవర్లు ఆడాలి. అంతకంటే తక్కువగా ఆడితే ఫలితం వెలువడదు. అలాంటి పరిస్థితిలో మ్యాచ్‌ను రద్దు చేసినట్లే అని చెబుతున్నారు. దురదృష్టవశాత్తు, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అంటే వర్షం వల్ల ఆట ఆగిపోయి ఐదు ఓవర్లు కూడా పూర్తికాకపోతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. మ్యాచ్‌ను తిరిగి పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు లేవు. ఇప్పటికే తలో రెండు విజయాలతో ఉన్న భారత్, పాక్.. 5 పాయింట్లతో నేరుగా సూపర్-8కి చేరుకుంటాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా టాప్ ప్లేస్ భారత్ దక్కించుకుంటుంది.