IND Vs NZ: 5 వికెట్లతో జడ్డూ మ్యాజిక్.. ముగిసిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు విజృంభించంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్ ముంగిట స్వల్ప విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టులో విల్ యంగ్ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 3 వికెట్లు.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235, భారత్ 263 పరుగులు చేశాయి. కాగా ముంబై పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో పరుగులు చేయడం కష్టమని క్రికెట్ నిపుణలు భావిస్తున్నారు. కాబట్టి తక్కువ టార్గెట్ ఉన్నా భారత బ్యాటర్లు నిలకడగా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో డారిల్ మిచెల్ 82 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీ సాయంతో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఈ హాఫ్ సెంచరీల సాయంతో భారత జట్టు 263 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్ల ముప్పతిప్పలు పెట్టారు. ఫలితంగా 2వ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో రోజు ఆట ఆరంభంలోనే రవీంద్ర జడేజా ఎజాజ్ పటేల్ వికెట్ తీశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 174 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున రవీంద్ర జడేజా 55 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేస్తే విజయం సాధించవచ్చు. దీంతో న్యూజిలాండ్‌పై క్లీన్ స్వీప్ ఓటమిని తప్పించుకోవచ్చు.
Ravindra Jadeja wraps things up immediately on Day 3 👌👌#TeamIndia need 147 runs to win the Third Test 🙌
Live – https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/AOXrDaTmFP
— BCCI (@BCCI) November 3, 2024
భారత్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఓ రూర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..