“ఫిట్‌గా ఉంటే జట్టులోనే కాదు, ప్లేయింగ్ 11లో ఉండేవాడు”: షమీకి ఇచ్చిపడేసిన అజిత్ అగార్కర్
Mohammed Shami vs Ajit Agarkar: మహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత చీలమండ, మోకాలి గాయాలకు గురై, శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. రంజీ మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వన్డేలకు కూడా ఫిట్‌గా ఉన్నట్లేనని షమీ అభిప్రాయపడ్డాడు.

Mohammed Shami vs Ajit Agarkar: భారత క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో లేకపోవడంపై ఇటీవల చెలరేగిన చర్చకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పష్టత ఇచ్చారు. ఓ కార్యక్రమంలో అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గనుక పూర్తి ఫిట్‌గా ఉండి ఉంటే, అతడు తప్పకుండా జట్టులో ఉండేవాడని తేల్చి చెప్పాడు.
ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై షమీ కూడా స్పందిస్తూ, తాను రంజీ ట్రోఫీలో ఆడుతున్నానని, అంటే తాను ఫిట్‌గానే ఉన్నానని, సెలక్టర్లకు తన ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ ఇవ్వడం తన పని కాదని పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అగార్కర్ ఏమన్నారంటే…
షమీ విషయంపై అగార్కర్‌ను ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు: “షమీ అద్భుతమైన ఆటగాడు, భారత్‌కు గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. అతను ఫిట్‌గా ఉండి ఉంటే, తప్పకుండా జట్టులో ఉండేవాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందే మేం ఈ విషయాన్ని చెప్పాం. దురదృష్టవశాత్తూ అప్పుడు అతను ఫిట్‌గా లేడు. ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అతడు ఉండాలని మేమంతా ఎంతగానో కోరుకున్నాం, కానీ అప్పుడు కూడా అతడి ఫిట్‌నెస్ సరిగా లేదు” అని తెలిపాడు.
“అతను గనుక నాకు నేరుగా ఈ విషయం గురించి మాట్లాడితే, నేను బదులిస్తాను. గత కొన్ని నెలలుగా నేను అతడితో చాలా సార్లు మాట్లాడాను. ఏదైనా సమస్య ఉంటే అది మేమిద్దరం మాట్లాడుకోవాల్సిన విషయం” అంటూ చెప్పుకొచ్చాడు.
“మా దేశీయ సీజన్ ఇప్పుడే మొదలైంది. అతను తగినంత ఫిట్‌గా ఉన్నాడో లేదో మేం చూస్తాం. రంజీ ట్రోఫీలో మరో రెండు మ్యాచ్‌ల్లో అతను ఎలా బౌలింగ్ చేస్తాడో పరిశీలిస్తాం. షమీ లాంటి నాణ్యమైన బౌలర్‌ను ఎవరు మాత్రం జట్టులో వద్దనుకుంటారు?” అంటూ తెలిపాడు.
ఫిట్‌నెస్ vs సెలక్షన్ వివాదం..
మహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత చీలమండ, మోకాలి గాయాలకు గురై, శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. రంజీ మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వన్డేలకు కూడా ఫిట్‌గా ఉన్నట్లేనని షమీ అభిప్రాయపడ్డాడు.
అయితే, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాత్రం, అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి కావాల్సిన పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను షమీ నిరూపించుకోవాలని, సెలక్షన్ ప్యానెల్ అతని ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఆటగాడి ఫిట్‌నెస్ స్థాయి, దేశీయ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగానే తిరిగి జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందని అగార్కర్ తన వ్యాఖ్యల ద్వారా సూచించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








