Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ టెక్నిక్‌ని కాపీ చేశా.. షాకిచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని
Rahul Dravid Technique: ఐపీఎల్ క్రికెట్‌ను పూర్తిగా మార్చేసిందని, ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేకాక, వంద సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చోటు సంపాదించడానికి భారతే ప్రధాన కారణమని రిషి సునక్ అభిప్రాయపడ్డారు.

Rahul Dravid Technique: భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్‌కి క్రికెట్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన వరల్డ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా తన క్రికెట్ ప్రేమను, ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా, తాను ద్రావిడ్ బ్యాటింగ్ టెక్నిక్‌ను కాపీ చేయడానికి కూడా ప్రయత్నించానని వెల్లడించి, షాకిచ్చాడు.
రిషి సునక్ ఆరాధ్య క్రికెటర్ ద్రవిడ్..
క్రికెట్‌తో తన అనుబంధం గురించి రిషి సునక్ మాట్లాడుతూ, క్రికెట్ తన జీవితంలో ఒక భాగమని తెలిపారు. ఆయన ఇంగ్లాండ్‌లోని అత్యంత క్రికెట్ అభిమానులు ఉన్న ప్రాంతమైన యార్క్‌షైర్ నుంచే ప్రాతినిధ్యం వహించడం వలన, క్రికెట్ ఎప్పుడూ తన జీవితంలో ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో, తన బాల్యంలో తనకు అత్యంత ఇష్టమైన ఆటగాళ్ళలో రాహుల్ ద్రావిడ్ ఒకరని సునక్ వెల్లడించారు.
“నేను చిన్నప్పుడు రాహుల్ ద్రావిడ్‌ను ఎంతగానో అభిమానించేవాడిని. ఆయన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌ను నేను కాపీ చేయడానికి కూడా ప్రయత్నించాను,” అని రిషి సునక్ పేర్కొన్నారు. ద్రావిడ్ స్థిరత్వం, క్లాసిక్ టెక్నిక్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.
ఇంగ్లాండ్‌కు మద్దతు, కానీ భారత్‌పై ‘సాఫ్ట్ స్పాట్’..
రిషి సునక్ ఇంగ్లాండ్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, భారత్‌పై తనకు ఒక ‘సాఫ్ట్ స్పాట్’ ఉందని చెప్పారు. తాను ఇంగ్లాండ్‌ను ఉత్సాహపరుస్తానని, అయితే భారత్ అంటే తనకి ప్రత్యేక అభిమానం అని తెలిపారు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకి తాను పెద్ద అభిమానినని, అందుకే RCB ద్వారా తన క్రికెట్ “ఫిక్స్” అవుతుందని నవ్వుతూ చెప్పారు.
జో రూట్, జేమ్స్ అండర్సన్‌పై ప్రశంసలు..
ప్రస్తుత క్రికెటర్ల గురించి అడిగినప్పుడు, ఇంగ్లాండ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ జో రూట్‌ను సునక్ ప్రశంసించారు. జో రూట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ అని, ఎక్కువ పరుగులు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పారు.
బౌలర్ల ఎంపిక విషయంలో ఇంగ్లాండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్, భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలో ఎవర్ని ఎంచుకుంటారని అడగగా, బుమ్రా ‘అద్భుతమైన’ బౌలర్ అయినప్పటికీ, తాను అండర్సన్‌ను ఎంచుకుంటానని రిషి సునక్ తెలిపారు. అండర్సన్ అంకితభావం (Commitment), వినయం (Humility) అసాధారణమైనవని ఆయన కొనియాడారు. అండర్సన్‌కు నైట్‌హుడ్ (Knightwood) బిరుదు సిఫార్సు చేయడంలో తాను పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
భారత్ గర్వించదగిన శక్తి..
ఐపీఎల్ క్రికెట్‌ను పూర్తిగా మార్చేసిందని, ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేకాక, వంద సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చోటు సంపాదించడానికి భారతే ప్రధాన కారణమని రిషి సునక్ అభిప్రాయపడ్డారు. ఇది 21వ శతాబ్దంలో భారత్ ఎంతటి ప్రభావిత శక్తిగా మారుతుందో తెలియజేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








