
వన్డే ప్రపంచకప్‌లో మరో థ్రిల్లింగ్ పోరుకు ధర్మశాల వేదికగా మారింది. శనివారం (అక్టోబర్ 28) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆఖరి వరకు పోరాడింది. అయితే ఈ రసవత్తర పోరులో ఆసీస్‌దే పైచేయి అయింది. ఛేదనలో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 19.1 ఓవర్లలో 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వార్నర్ (81) ఔటయ్యాడు. మరోవైపు బ్యాటింగ్ కొనసాగించిన ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 7 సిక్సర్లు, 10 ఫోర్లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 41 పరుగులు చేయగా, జోష్ ఇంగ్లిస్ 38 పరుగులు చేశాడు. అలాగే, చివరి ఓవర్లలో పాట్ కమిన్స్ 37 పరుగులతో విజృంభించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది.
ఆ తర్వాత 389 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు డెవాన్ కాన్వే (28), విల్ యంగ్ (32) శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర 77 బంతుల్లో తుపాన్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు డారిల్ మిచెల్ 54 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు స్కోరు 40 ఓవర్లలో 300 పరుగుల మార్కును చేరుకుంది. ఈ దశలో 89 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 116 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. అయితే ఆఖరి దశలో జిమ్మీ నీషమ్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫలితంగా మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చింది. ఆఖరి ఓవర్‌లో న్యూజిలాండ్ జట్టుకు 19 పరుగులు కావాలి. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో నీషమ్ (58) రనౌట్ కావడంతో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 771 పరుగులు చేశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు.
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..