PCB Scam : మీ కక్కుర్తి పాడుగాను.. ఎన్ని కోట్లు నొక్కేశారురా బాబు.. పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ కుంభకోణం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలు, అక్రమ నియామకాలు జరిగినట్లు ఒక ఆడిట్ నివేదిక వెల్లడించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో జరిగిన ఈ భారీ ఆర్థిక అవకతవకలు ఆ దేశ క్రికెట్‌కు మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి. ఇటువంటి అక్రమాలు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. దీనిపై ఐసీసీ కూడా స్పందించే అవకాశం ఉంది.

PCB Scam : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఒక ఆడిట్ నివేదికలో ఈ బోర్డులో కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలు, కాంట్రాక్టుల కేటాయింపు, అక్రమ నియామకాలు జరిగినట్లు వెల్లడైంది. పాకిస్థాన్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఈ నివేదికలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.ఈ నివేదికలో వెల్లడైన కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వెళితే..అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో భద్రత కోసం నియమించిన పోలీసుల ఆహారం కోసం సుమారు రూ.6.33 కోట్లు చెల్లించారు. కరాచీలోని హై పర్ఫార్మెన్స్ సెంటర్‌లో అండర్-16 జట్టుకు ముగ్గురు కోచ్‌లను అక్రమంగా నియమించారు. వారి జీతాల కోసం సుమారు రూ.54 లక్షలు ఖర్చు చేశారు. ఓపెన్ కాంపిటీషన్ లేకుండానే టికెట్ కాంట్రాక్టులను అక్రమంగా కేటాయించారు.
నివేదిక ప్రకారం.. మ్యాచ్ అధికారులకు కూడా అధిక మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా దారితీయవచ్చు అనే అనుమానాలను పెంచుతోంది. అధికారులకు రూ.39 లక్షలకు పైగా చెల్లించారు. అంతేకాకుండా, మీడియా డైరెక్టర్ నియామకంపై ప్రతి నెలా రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.
గత కొన్నేళ్లుగా పీసీబీలో చాలా మార్పులు జరిగాయి. 2022 డిసెంబర్‌లో రమీజ్ రాజాను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత నజమ్ సేథి, జకా అష్రఫ్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ పదవిలో మొహ్సిన్ నఖ్వి ఉన్నారు.మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.38 లక్షలు అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కాలంలో అధ్యక్షుడికి యుటిలిటీ ఛార్జీలు, వసతి, ఇతర ఖర్చుల కోసం రూ.41.7 లక్షలు అనధికారికంగా చెల్లించారు.
నివేదిక మీడియా డైరెక్టర్ నియామకంపై కూడా తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. 2023 అక్టోబర్‌లో ఎలాంటి ప్రక్రియ లేకుండానే మీడియా డైరెక్టర్‌ను నియమించారు. ఈ పదవికి ప్రకటన జూలై 17న వచ్చినప్పటికీ, నియామకం, ఒప్పంద పత్రాలు, జాయినింగ్ అన్నీ ఒకే రోజు జరిగాయి. ఆడిటర్ జనరల్, సరైన అనుమతులు లేదా బిడ్డింగ్ ప్రక్రియ లేకుండానే నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు. దీనికి ఉదాహరణగా పంజాబ్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాల డీజిల్ కోసం సుమారు 1.09 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




