SRH: 54 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. 15 ఫోర్లు, 5 సిక్సర్లతో సన్‌రైజర్స్ బ్యాటర్ విశ్వరూపం.. ఎవరంటే?
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. విండీస్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యాన్ని..
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. విండీస్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యాన్ని సఫారీల జట్టు కేవలం 29.3 ఓవర్లలోనే చేధించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్(61 బంతుల్లో 119 పరుగులు నాటౌట్, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో 3 వన్డేల సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. అతనికి తోడుగా మార్కో జాన్సెన్(43), ఐడెన్ మార్క్‌రమ్(25) ఫర్వాలేదనిపించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 260 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రెండన్ కింగ్(72) అర్ధ సెంచరీతో ఆదరగొట్టగా.. హోల్డర్(36), పూరన్(39) క్యామియో ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, ఫోర్టిన్, కేత్జీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇక 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ సమయంలో క్లాసెన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 54 బంతుల్లో సెంచరీ.. మొత్తంగా 61 బంతుల్లో 119 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడు క్రీజులోకి వచ్చినప్పుడు 12.1 ఓవర్లలో 87/4 స్కోర్ కాగా.. మ్యాచ్ ముగిసేసరికి సఫారీలు 29.3 ఓవర్లలో 264/6 కొట్టారు. అంటే కేవలం 17.1 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 177 పరుగులు రాబట్టింది. దీన్ని బట్టే క్లాసెన్ విధ్వంసం ఎలా ఉందో చెప్పొచ్చు. అతడికి మార్కో జాన్సెన్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు) తోడ్పడటంతో.. లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు సునాయాసంగా చేధించగలిగింది.
కాగా, ఐపీఎల్ 2023లో హెన్రిచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయితే ఈసారి హైదరాబాద్ జట్టు.. క్లాసెన్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి తీసుకుంది. ఇక ఇప్పుడు అతడున్న ఫామ్ చూసి.. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
masss batting display ?? by klaassen hundred in just 54 balls?#SAvsWI#OrangeFireIdhi pic.twitter.com/NuZVmwZlQB
— notnot7 (@lostcause4aid) March 21, 2023