IPL 2025: సన్‌రైజర్స్‌పై పగ సాధిస్తున్న HCA..? నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌కు అనుకూలంగా పిచ్..?
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో అల్లాడుతోంది. నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టతరం చేసుకుంది. ఉప్పల్ పిచ్ గుజరాత్‌కు అనుకూలంగా సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. హెచ్‌సీఏతో వివాదాల నేపథ్యంలో ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ SRH పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ కాటేరమ్మ కొడుకులు ఓటమి పాలయ్యారు. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. తొలి మ్యాచ్‌లో భయంకరమైన బ్యాటింగ్‌తో గెలిచిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. ఇక్కడ నుంచి ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లిందంటే.. అది అద్బుతమనే చెప్పాలి. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన సన్‌రైజర్స్.. తర్వాత బౌలింగ్‌లో అంతకంటే ఫేలవ ప్రదర్శన కనబర్చింది.
మొత్తంగా.. సొంత గ్రౌండ్‌లో గుజరాత్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. ఈ మ్యాచ్ తర్వాత ఓ కొత్త కాంట్రవర్సీ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఉప్పల్ పిచ్‌ను సన్‌రైజర్స్ టీమ్‌కు వ్యతిరేకంగా, గుజరాత్ టైటాన్స్‌కు అనుకూలంగా రెడీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేంటి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మన హోం టీమ్ కదా.. సొంత మైదానంలో హోం టీమ్‌కు పిచ్ అనుకూలంగా ఉండాలి కానీ, ప్రత్యర్థి టీమ్‌ను అనుకూలంగా రెడీ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో ఎంత నిజముందో భవిష్యత్తులో తెలుస్తుంది కానీ.. ప్రస్తుతానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉప్పల్ పిచ్ క్యూరేటర్‌పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.
ఉప్పల్ పిచ్ అంటే బ్యాటింగ్‌కు స్వర్గధామం. కానీ, నిన్నటి మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేదు. బాల్‌లో బౌన్స్ లేదు, స్వింగ్ అయింది.. మొత్తంగా బ్యాటర్లకు పరీక్షగా మారింది. వీరబాదుడికి మారుపేరులా మారిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఈ పిచ్‌పై నిలువలేకపోయారు. గుజరాత్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే చెలరేగిపోయాడు. ఇద్దరు ఓపెనర్లును అతనే పెవిలియన్ చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్‌లో నిలబడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 34 బంతులాడి కేవలం 31 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక లాభం లేదని కాటేరమ్మ కొడుకు క్లాసెన్ బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేసినా.. రెండు మూడు షాట్ల తర్వాత అతను కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత మరోసారి సిరాజ్ చెలరేగి ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి.. ఎస్‌ఆర్‌హెచ్‌ను 152 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొన్ని షాట్లు ఆడటంతో ఆ మాత్రం ఫైటింగ్ స్కోర్ అయినా వచ్చింది. లేదంటే.. 130 లోపే ఎస్‌ఆర్‌హెచ్ కొల్యాప్స్ అయ్యేది. కాస్త గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది.. సన్‌రైజర్స్ బౌలర్లు ఫైట్ చేస్తారని అనుకుంటే.. పూర్తిగా తేలిపోయారు. గత మ్యాచ్‌లో బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడి గెలిచి వస్తున్న గుజరాత్.. ఉప్పల్‌లో కూడా బ్లాక్ సాయిల్ పిచ్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంది. కెప్టెన్ గిల్ ఒక ఎండ్‌లో పాతుకుపోతే.. వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్ మ్యాచ్ గుజరాత్ చేతుల్లో పెట్టేశాడు. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ బలం బ్యాటింగ్ అయినప్పుడు.. వాళ్లకు అనుకూలంగా కాకుండా.. బ్లాక్ సాయిల్ పిచ్‌ను ఎందుకు రెడీ చేశారో అర్థం కావడం లేదంటూ క్రికెట్ నిపుణులు, అభిమానులు అంటున్నారు. ఈ విషయంలో చాలా మంది హెచ్‌సీఏపై విమర్శలు గుప్పిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో ఉన్న విభేదాల కారణంగానే హెచ్‌సీఏ ఇలా ఎస్‌ఆర్‌హెచ్‌కు వ్యతిరేక పిచ్‌ను రెడీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవలె ఫ్రీపాస్ టిక్కెట్ల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌కు, హెచ్‌సీఏకు మధ్య తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. హెచ్‌సీఏ తమను వేధిస్తుందంటూ ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. అవసరం అయితే.. హైదరాబాద్‌ను వదిలి.. తాము వైజాగ్‌కు వెళ్లిపోతామని కూడా ఎస్‌ఆర్‌హెచ్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందనే విషయం బయటికి వచ్చినప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో ఈ వివాదం ఇంకా సమసిపోలేదని తెలుస్తోంది. ఫ్రీపాస్ టిక్కెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ.. ఎస్‌ఆర్‌హెచ్ తమను బజారుకీడ్చిందని హెచ్‌సీఏ మనసులో పెట్టుకొని.. ఇలా సన్‌రైజర్స్ టీమ్‌కు వ్యతిరేకంగా పిచ్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి వీటిపై హెచ్‌సీఏ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




