AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు

Cricketers Protest: ఉత్తరప్రదేశ్‌లో మూడు రంజీ జట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 250 మందికి పైగా యువ క్రికెటర్లు, తల్లిదండ్రులు లక్నోలో నిరసన చేపట్టారు. 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క రంజీ జట్టు సరిపోదని, ఎక్కువ మంది ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలని కోరారు. యూపీ టీ20 లీగ్ సెలక్షన్‌లోనూ ప్రాంతీయ వివక్ష ఉందని ఆరోపించారు.

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు
Up Cricketers Protest
Rakesh
|

Updated on: Aug 25, 2026 | 1:54 PM

Share

Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు. సుమారు 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క రంజీ జట్టు ఉండటం వల్ల వేలాది మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు తగిన అవకాశాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పూర్వాంచల్ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద భారీ నిరసన చేపట్టారు. పూర్వాంచల్, సెంట్రల్ యూపీ ప్రాంతాలకు చెందిన జెన్-జీ క్రికెటర్లు తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు క్రికెట్ అసోసియేషన్ల డిమాండ్

అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంత పెద్ద రాష్ట్రంలో టాలెంటుకు కొదవలేదు. ఒక్కటే జట్టు ఉండటం వల్ల వందలాది మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ల భవిష్యత్తు నాశనమవుతోంది. అందుకే యూపీని మూడు క్రికెట్ మండలాలుగా విభజించి, మూడు వేర్వేరు అసోసియేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం మూడు రంజీ జట్లను బరిలోకి దించాలని వారు ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కువ మంది కుర్రాళ్లకు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడే అవకాశం లభిస్తుందని, తద్వారా వారు తమ ప్రతిభను నిరూపించుకోగలరని స్పష్టం చేస్తున్నారు.

యూపీ టీ20 లీగ్‌లోనూ తీవ్ర వివక్ష

కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లోనూ ప్రాతినిధ్యం సరిగ్గా లేదని ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ లీగ్‌లో ఎంపిక చేసిన దాదాపు 150 మంది ప్లేయర్లలో పూర్వాంచల్, మధ్య యూపీ ప్రాంతాల నుంచి కేవలం 16 మందికి మాత్రమే చోటు దక్కింది. అదే సమయంలో పశ్చిమ యూపీలోని తొమ్మిది జిల్లాల నుంచి ఏకంగా 89 మందిని ఎంపిక చేశారని వారు గణాంకాలతో సహా బయటపెట్టారు. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ప్లేయర్లను కూడా లీగ్‌లోకి తీసుకోవడంపై ప్రాంతీయ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్‌లో భారీ ఆందోళనకు సమరశంఖం

లక్నోలో జరిగిన ఈ ధర్నా కేవలం ఆరంభం మాత్రమేనని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సెప్టెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని అసోసియేషన్ హెచ్చరించింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువ క్రికెటర్లను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారత జాతీయ జట్టుకు ఎదిగేందుకు డొమెస్టిక్ క్రికెట్ తొలి మెట్టు కాబట్టి, తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us