Team India: టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం.. ఎప్పుడంటే?
Team India: భారత క్రికెట్ జట్టు తర్వాతి తరం ప్రతిభ టీం ఇండియా తలుపులు తడుతోంది. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనలు, దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు చాలా మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాయి. సెలెక్టర్లు ఇప్పుడు పేరు గుర్తింపు కంటే ఫాంకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరంలో కొంతమంది కొత్త ముఖాలు టీమిండియా క్యాప్‌లను దక్కించుకోవచ్చు.

4 IPL Players Ready for Team India Debut: భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. ముఖ్యంగా ఐపీఎల్ వేదికగా ప్రతి ఏటా కొత్త కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తున్నాయి. గత సీజన్‌లో తమ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన నలుగురు యువ ఆటగాళ్లు త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించబోతున్నారు. వైభవ్ సూర్యవంశీ వంటి సంచలనం నుంచి అకీబ్ నబీ వంటి పేస్ బౌలర్ వరకు.. భారత క్రికెట్ భవిష్యత్తును మార్చబోయే ఆ నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi): కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు వైభవ్. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే ఈ చిన్నారి సంచలనం త్వరలోనే భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా కనిపించే అవకాశం ఉంది.
2. విప్రజ్ నిగమ్ (Vipraj Nigam): భారత జట్టుకు ప్రస్తుతం స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ల అవసరం ఉంది. ఆ లోటును భర్తీ చేసే సత్తా విప్రజ్ నిగమ్‌కు ఉంది. 21 ఏళ్ల ఈ యువకుడు ఐపీఎల్ 2025లో 11 వికెట్లు తీయడమే కాకుండా, 180 స్ట్రైక్ రేట్‌తో విలువైన పరుగులు చేశాడు. నంబర్ 8లో బ్యాటింగ్‌కు వచ్చి ఫినిషర్ పాత్ర పోషించగల ఇతను సెలెక్టర్ల రాడార్‌లో ఉన్నాడు.
3. అకీబ్ నబీ (Aaqib Nabi): జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఈ స్పీడ్ గన్ ప్రస్తుత దేశవాళీ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. రంజీ ట్రోఫీలో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 29 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇతనిని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేయడం ఇతని డిమాండ్‌ను తెలియజేస్తోంది. టీమిండియాలో ఫాస్ట్ బౌలర్ల రొటేషన్ పాలసీ ప్రకారం అకీబ్ కు త్వరలోనే అవకాశం దక్కవచ్చు.
4. ఆయుష్ మ్హాత్రే (Ayush Mhatre): చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కనుగొన్న మరో ఆణిముత్యం ఆయుష్ మ్హాత్రే. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఇతను, ఐపీఎల్ 2026లో మరోసారి రాణిస్తే సీనియర్ జట్టులోకి రావడం ఖాయం. ధోనీ శిష్యరికంలో రాటుదేలుతున్న ఆయుష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నలుగురు ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శనపైనే కాకుండా, దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత భారత జట్టులో పెను మార్పులు జరగనున్న నేపథ్యంలో, ఈ యువ రక్తం టీమిండియాను మరో స్థాయికి తీసుకువెళ్తుందని ఆశించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



