Video: మరీ ఇలానా.? గిల్‌ను దొంగదెబ్బ తీసిన ఇంగ్లాండ్.. బ్రూక్ మైండ్ గేమ్ మీరూ చూసేయండి
Harry Brook's Mind Games Against Shubman Gill Triple Century: శుభమాన్ గిల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత, కొద్దిసేపటికే అవుట్ అయ్యాడు. ట్రిపుల్ సెంచరీకి చేరువైన క్రమంలో హ్యారీ బ్రూక్ రంగంలోకి దిగాడు. మైండ్ గేమ్స్ మొదలుపెట్టి గిల్ ఏకగ్రతను దెబ్బ తీశాడు. దీంతో శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

Harry Brook’s Mind Games Against Shubman Gill Triple Century: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండో టెస్టులో కెప్టెన్‌గా డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో గిల్ ట్రిపుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో, ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ చేసిన ‘మైండ్ గేమ్స్’ కారణంగానే గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్ అయిందా అన్న చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ vs ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు శుభ్మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా తన రెండో మ్యాచ్ ఆడుతూ 269 పరుగులు సాధించి ఇంతకు ముందు ఎవరూ సాధించని మైలురాయిని చేరుకున్నాడు. దీనికి ముందు, 2019లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ చేసిన 254 (నాటౌట్) పరుగులే భారత కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరుగా ఉండేది. భారత కెప్టెన్‌గా గిల్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ రికార్డును అధిగమించాడు. కాగా, ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన గిల్.. ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశానికి దగ్గరగా చేరాడు. అలా చేయగలిగితే, టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ అయ్యేవాడు.
అసలేం జరిగింది?
టీ విరామం తర్వాత, షోయబ్ బషీర్ వేసిన ఓవర్లో, హ్యారీ బ్రూక్ రంగంలోకి దిగాడు. 265 మార్క్ దాటి బ్యాటింగ్ చేస్తున్న శుభ్‌మాన్ గిల్‌తో మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. బ్రూక్ స్లిప్‌లో నిల్చుని, గిల్‌తో సరదాగా మాట్లాడుతుండటం కనిపించింది. బ్రూక్ భారత కెప్టెన్‌తో ‘ట్రిపుల్ సెంచరీ’ గురించి మాట్లాడుతున్నట్లు అనిపించింది. గిల్ కూడా బ్రూక్‌కి ధీటుగా సమాధానమిచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
మైండ్ గేమ్స్ ఆడాడా?
— The Game Changer (@TheGame_26) July 3, 2025
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ వీరిద్దరి సంభాషణను డీకోడ్ చేశాడు. ఆయన మేరకు బ్రూక్ “290లు అత్యంత కష్టతరమైనవి” అని గిల్‌తో అన్నట్లు ఊహించాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ “నీ దగ్గర ఎన్ని ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి?” అంటూ ధీటుగా సమాధానమిచ్చినట్లు తెలిపాడు. కాగా, 2024లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్‌లోని 143వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత 144వ ఓవర్‌లోని మూడవ బంతికి శుభ్‌మాన్ గిల్ ఔటయ్యాడు.
గిల్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్, ఈ ఫార్మాట్‌లో అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుగా మారింది. టెస్ట్‌లలో ఒక భారత కెప్టెన్, ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో టెస్ట్‌లలో ఒక భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. రెండో రోజు భారత జట్టు 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) వరుసగా ఆరవ, ఏడవ వికెట్లకు 203, 144 పరుగుల భాగస్వామ్యాలను గిల్‌తో నెలకొల్పారు.
అనంతరం ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ మొదలపెట్టింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాష్ దీప్ ఆదిలోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాకిచ్చాడు. 2 వికెట్లతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత సిరాజ్ కూడా ఓ వికెట్ పడగొట్టాడు. హ్యారీ బ్రూక్ (30), జో రూట్ (18) క్రీజులో నిలిచారు.
గతంలో కూడా క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నప్పుడు, ప్రత్యర్థి బౌలర్లు లేదా ఫీల్డర్లు వారితో మాట్లాడటం, వారి ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా, శుభమాన్ గిల్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యం, కెప్టెన్సీ నైపుణ్యాలు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఎంతో కీలకం కానున్నాయి. ఈ సంఘటన ఒకవైపు చర్చకు దారితీసినప్పటికీ, గిల్ సాధించిన డబుల్ సెంచరీ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..