AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.. కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత సీజన్ ఓపెనర్‌లో గెలిచిన ముంబై.. రోహిత్, రికల్టన్ విధ్వంసంతో రికార్డులు తిరగరాసింది. ఈ గెలుపు కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చిందని పాండ్యా ఎమోషనల్ అయ్యాడు

Hardik Pandya : 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.. కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
Hardik Pandya
Rakesh
|

Updated on: Mar 30, 2026 | 7:27 AM

Share

Hardik Pandya : ముంబై ఇండియన్స్ అంటేనే ఐపీఎల్‌లో స్లో స్టార్టర్స్ అనే ముద్ర ఉంది. సీజన్ ఏదైనా సరే, మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఈ జట్టుకు ఒక అలవాటుగా మారిపోయింది. చివరిసారిగా 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై తమ మొదటి మ్యాచ్ గెలిచిన ముంబై, ఆ తర్వాత ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచినా.. మొదటి మ్యాచ్‌లో మాత్రం గెలవలేకపోయింది. కానీ, సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసి, ఆ పాత శాపాన్ని పటాపంచలు చేసింది. ఈ విజయంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గెలుపు కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.

కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు ఆటలాడుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ (78), రాయన్ రికల్టన్ (81) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. రోహిత్ తన పాత ఫామ్‌ను గుర్తు చేస్తూ 8 సిక్సర్లతో విరుచుకుపడగా, రికల్టన్ అతనికి ధీటుగా 6 సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వీరిద్దరి వీరబాదుడు చూస్తుంటే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసినట్టే అనిపించింది. చివరకు ముంబై మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో అజింక్య రహానే (67), అంగ్క్రిష్ రఘువంశీ (51) హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. ఒక దశలో కేకేఆర్ 240 నుంచి 250 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వారిని 220 పరుగుల వద్దే నియంత్రించగలిగారు. “ప్రస్తుత క్రికెట్ ట్రెండ్ మరియు పిచ్ కండిషన్స్ చూస్తుంటే, కేకేఆర్‌ను 220 పరుగులకే కట్టడి చేయడం గొప్ప విషయం. ఆ క్రెడిట్ అంతా మా బౌలర్లకే దక్కుతుంది. ఈ స్కోరును ఛేజ్ చేయగలమనే నమ్మకం మాకు ఉంది” అని పాండ్యా జట్టును మెచ్చుకున్నాడు.

సీనియర్ ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను కాదని రాయన్ రికల్టన్‌ను ఎంచుకోవడంపై వస్తున్న చర్చలకు హార్దిక్ ఫుల్ స్టాప్ పెట్టాడు. “క్వింటన్ డికాక్ అద్భుతమైన వ్యక్తి. జట్టు ఒక ప్లేయర్‌కు (రికల్టన్) సపోర్టు ఇస్తున్నప్పుడు, అతడు దాన్ని అర్థం చేసుకున్నాడు. గత సీజన్‌లో రికల్టన్ మా కోసం చాలా బాగా ఆడాడు, అందుకే అతడికి ఈ అవకాశం ఇచ్చాం. అది క్లిక్ అయ్యింది” అని చెప్పుకొచ్చాడు. అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. “రోహిత్ కొట్టే కొన్ని షాట్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన బ్యాటింగ్ కేవలం క్లాస్ మాత్రమే కాదు, మాస్ విధ్వంసం” అని తన మాజీ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us