AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కండలు చూపిస్తూ సెలబ్రేషన్ అనుకుంటే పొరబడినట్లే.. జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!

Dhruv Jurel Tattoo: సెంచరీతో జట్టుకు కీలక పరుగులు అందించడంతో పాటు.. తన టాటూ వెనుక ఉన్న కుటుంబ కథను పంచుకున్న జురెల్‌ ఈ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా మార్చుకున్నాడు. తన తాత రైతు, తండ్రి సైనికుడనే విషయాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన ఆ సెలబ్రేషన్‌.. అతడి కెరీర్‌లో గుర్తుండిపోయే సందర్భంగా నిలిచింది.

Video: కండలు చూపిస్తూ సెలబ్రేషన్ అనుకుంటే పొరబడినట్లే.. జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Dhruv Jurel Century Celebration
Venkata Chari
|

Updated on: Aug 24, 2026 | 8:20 PM

Share

Dhruv Jurel Tattoo Celebration: శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ అద్భుత సెంచరీతో భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. రెండో రోజు ఆటలో 171 బంతుల్లో సెంచరీ పూర్తి అనంతరం జురేల్ వింత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈక్రమంలో జురెల్ సెంచరీ కంటే తన మోచేతిపై ఉన్న టాటూనే తెగ వైరల్ అవుతోంది. ఈ టాటును చూపిస్తూ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తొలుత ఇది సాధారణంగా కండలు చూపించే వేడుకలా కనిపించింది. కానీ, దాని వెనుక ఓ భావోద్వేగ కారణం ఉందని ఆతర్వాత వెల్లడైంది. జురెల్‌ చేతిపై ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ అనే స్లోగన్ రాసి ఉంది. తన తాత రైతు, తండ్రి సైనికుడు కావడమే ఇందుకు కారణం. వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ టాటూ వేయించుకున్నట్లు జురెల్‌ చెప్పుకొచ్చాడు. సెంచరీ తర్వాత తాను చేసిన సెలబ్రేషన్‌ కూడా తన కుటుంబానికి అంకితం చేశానంటూ చెప్పుకొచ్చాడు.

‘జై జవాన్‌.. జై కిసాన్‌’ అంటూ ప్రత్యేక సెలబ్రేషన్‌..!

రెండో రోజు ఆటలో ధ్రువ్‌ జురెల్‌ తన టెస్టు కెరీర్‌లో 2వ సెంచరీ సాధించాడు. 135.4 ఓవర్‌‌లో అసిత ఫెర్నాండో వేసిన బంతిని మిడ్‌ఆఫ్‌ వైపు ఆడిన జురెల్‌.. వేగంగా సింగిల్‌ కోసం ప్రయత్నించి డైవ్‌ చేశాడు. ఆ తర్వాత మహ్మద్‌ సిరాజ్‌తో కలిసి తన సెంచరీని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూస్తూ తన కండను చూపించాడు. ముందు ఇది సాధారణ బైసెప్‌ సెలబ్రేషన్‌లా కనిపించింది. కానీ జురెల్‌ అసలు ఉద్దేశం వేరేనని ఆ తర్వాత తెలిసింది. తన చేతిపై ఉన్న ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ టాటూను చూపించేందుకే అలా చేసినట్లు తెలిపాడు.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

టాటూ వెనుక భావోద్వేగ కారణం..

సెంచరీ అనంతరం భారత జట్టు తరపున పోస్ట్‌-డే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు వచ్చిన జురెల్‌ను.. ఆ సెలబ్రేషన్‌ గురించి ప్రశ్నించారు. దానికి అతడు తన టాటూ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. “నా మూలాలను మర్చిపోవద్దనుకుంటున్నా. మా తాత రైతు.. మా నాన్న సైనికుడు. అందుకే ఈ టాటూ సెలబ్రేషన్‌” అంటూ జవాబిచ్చాడు.

జురెల్‌ గతంలోనూ భారత్‌ తరపున హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసిన సందర్భాల్లో తన తండ్రికి నివాళిగా ఆర్మీ సెల్యూట్‌ చేసేవాడు. ఇప్పుడు టాటూను చూపిస్తూ చేసిన సెలబ్రేషన్‌ కూడా తన కుటుంబ నేపథ్యంతో ముడిపడి ఉండటం విశేషం.

భారత్‌ను భారీ స్కోరుకు చేర్చిన జురెల్‌..

ఓవర్‌నైట్‌ స్కోరు 300/2తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. జురెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. మొత్తం 138 ఓవర్లలో భారత్‌ ఈ స్కోరు సాధించింది. దీంతో చివరి గంటలో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగి, 2 వికెట్లు కోల్పోయింది.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

ధ్రువ్ జురెల్‌ తన ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో జట్టును ఆదుకున్నాడు. అతడి సెంచరీతో భారత్‌ భారీ స్కోరు సాధించడమే కాకుండా శ్రీలంకపై ఒత్తిడి పెంచింది.

టెస్టు జట్టులో ప్లేస్ ఫిక్స్..?

25 ఏళ్ల ధ్రువ్‌ జురెల్‌ 2024లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి రాలేదు. ఇషాన్‌ కిషన్‌, కేఎస్‌ భరత్‌ వంటి వికెట్‌కీపర్‌ బ్యాటర్లకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి.

పంత్‌ తిరిగి వచ్చిన తర్వాత జురెల్‌ ఎక్కువగా బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గానే కొనసాగాడు. పంత్‌కు గాయం అయితేనే తుది జట్టులో చోటు దక్కేది. ఈ సిరీస్‌లో మాత్రం సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడటంతో జురెల్‌కు అవకాశం వచ్చింది.

ఈసారి అతడికి ఏడో స్థానంలో స్థిరమైన బ్యాటింగ్‌ బాధ్యతలు అప్పగించారు. వచ్చిన అవకాశాన్ని జురెల్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటివరకు 173 పరుగులు చేశాడు. అతడి సగటు 86.50గా ఉంది. ఇందులో ఒక అర్ధశతకం, ఓ సెంచరీ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us