IPL 2025: ఎయిర్ ఇండియాపై ఫైర్ అయిన వార్నర్ భాయ్! పైలట్లు లేని ఫ్లైట్స్ అంటూ..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్లు లేని విమానంలో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటి లిసా రే కూడా ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలతో విమానయాన సంస్థ సేవల నాణ్యతపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇటీవల ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పైలట్లు లేని విమానంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిన సంఘటనను సోషల్ మీడియాలో వెల్లడించారు. ఐపీఎల్‌లో ఆడేందుకు భారత్‌కు తరచుగా వచ్చే వార్నర్, ఈసారి విమానయాన అనుభవం కారణంగా తీవ్ర నిరాశకు గురయ్యారు. “@airindia మేము పైలట్లు లేని విమానం ఎక్కాము, గంటల తరబడి విమానంలో వేచి ఉన్నాము. మీకు విమానానికి పైలట్లు లేరని తెలిసి కూడా మీరు ప్రయాణీకులను ఎందుకు ఎక్కించుకుంటారు?” అంటూ వార్నర్ విమానయాన సంస్థపై ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
వార్నర్‌కు ఎదురైన ఈ అనుభవం ఒక్కసారిగా వైరల్ కాగా, ఎయిర్ ఇండియా సేవలపై మరో విమర్శ కూడా వెలువడింది. భారతీయ-కెనడియన్ నటి లిసా రే కూడా ఇటీవల ఇదే సంస్థను విమర్శించారు. తన 92 ఏళ్ల తండ్రి అనారోగ్యంతో ఉన్న కారణంగా తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని, కానీ వైద్య మినహాయింపును ఎయిర్ ఇండియా నిరాకరించిందని ఆమె ఆరోపించారు.
లిసా రే టికెట్‌ను థర్డ్ పార్టీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవడంతో, రద్దు రుసుము మాఫీ విషయంలో ఆమెకు ఎయిర్ ఇండియా ఏ విధమైన సహాయాన్ని అందించలేదని తెలుస్తోంది. టికెట్ తిరిగి చెల్లించని విధమైనదిగా ఉన్నందున, మినహాయింపును నిరాకరించినట్లు ఆమె చెప్పింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, “ప్రియమైన శ్రీమతి రే, మీ ఆందోళన పట్ల మేము సానుభూతి చెందుతున్నాము, మీ తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి మీరు మాకు వ్రాసిన ఇమెయిల్ చిరునామా లేదా కేసు ID (ఏదైనా ఉంటే) DM ద్వారా మాకు సహాయం చేయండి. మేము దానిని పరిశీలిస్తాము” అని పేర్కొంది.
ఈ రెండు సంఘటనలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఎయిర్ ఇండియా సర్వీసులపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో, ప్రయాణికుల అవసరాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, పైలట్లు లేని విమానంలో ప్రయాణీకులను గంటల తరబడి నిరీక్షింపజేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రయాణీకులకు సౌకర్యం కల్పించకపోవడం వంటి అంశాలు విమానయాన సంస్థల నిబద్ధతను ప్రశ్నించేలా చేస్తున్నాయి.
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2025 కోసం భారత్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. అతను గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించి చాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా అతని క్రికెట్‌లోని ప్రస్థానం అభిమానులకు స్ఫూర్తినిచ్చేలా ఉంది. కానీ, ఈ సంఘటన అతని భారత ప్రయాణ అనుభవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టుగా కనిపిస్తోంది. మరి ఎయిర్ ఇండియా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి!
@airindia we’ve boarded a plane with no pilots and waiting on the plane for hours. Why would you board passengers knowing that you have no pilots for the flight? 🤦♂️🤦♂️
— David Warner (@davidwarner31) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.