Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడి వేగం గవాస్కర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లని వణికించింది.. విండీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌ అతడు..

Cricket News: క్రికెట్ గురించి చర్చ జరిగినప్పుడల్లా 1970-80లలో వెస్టిండీస్‌ ఫాస్ట్ బౌలింగ్అంశం కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది.

అతడి వేగం గవాస్కర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లని వణికించింది.. విండీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌   అతడు..
Andy Roberts
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2022 | 8:48 AM

Cricket News: క్రికెట్ గురించి చర్చ జరిగినప్పుడల్లా 1970-80లలో వెస్టిండీస్‌ ఫాస్ట్ బౌలింగ్ అంశం కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫాస్ట్ బౌలింగ్‌ మంచి జోరు మీద ఉంది. బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడానికే కాకుండా వారిని భయపెట్టడానికి కూడా ఒక ఆయుధంగా వాడేవారు. కొన్నిసార్లు స్టంప్‌లు పగిలాయి. మరి కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌ల తలలు పగిలాయి. ముఖ్యంగా ఆ కాలంలో ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే వెస్టిండీస్ బౌలర్లే గుర్తుకు వచ్చేవారు. అందులో ప్రముఖుడు ఆండీ రాబర్ట్స్. ఈరోజు అతడి పుట్టిన రోజు. వీకెండ్ స్పెషల్‌లో ఈ గొప్ప ఫాస్ట్ బౌలర్ గురించి తెలుసుకుందాం.

ఆండర్సన్ మోంట్‌గోమెరీ ఎవర్టన్ రాబర్ట్స్ అంటే ఆండీ రాబర్ట్స్. వెస్టిండీస్ క్రికెట్‌లో అత్యంత ఫాస్ట్‌ బౌలర్‌గా చెప్పవచ్చు. అతను 29 జనవరి 1951న ఆంటిగ్వాలోని ఒక గ్రామంలో జన్మించాడు. ఆండీ రాబర్ట్స్ ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టాడు. అతను 14 మంది తోబుట్టువులలో ఒకడు. ఆంటిగ్వా నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టులోకి ప్రవేశించిన తొలి క్రికెటర్. అతని ఎంట్రీతో విండీస్ జట్టులో యాంటిగన్ ఆటగాళ్లకు మార్గం సుగమమైంది. అయితే ఆండీ రాబర్ట్స్ స్వయంగా వెస్టిండీస్ టెస్టు జట్టుకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీనికి కారణం అతను క్రికెట్‌ ఆలస్యంగా ప్రారంభించడమే.

6 వారాలు మాత్రమే కోచింగ్

రాబర్ట్స్ 16 ఏళ్ల వరకు క్రికెట్ ఆడలేదు. కానీ అది ప్రారంభమైన తర్వాత అతను నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చాడు. 18 ఏళ్ల వయసులో లీవార్డ్ దీవుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. బదులుగా అతను మొదటిసారిగా ఇంగ్లాండ్‌లో కోచింగ్ అవకాశాన్ని పొందాడు. అది కూడా కేవలం 6 వారాలు మాత్రమే. విండీస్ జట్టులో చేరడానికి ముందు రాబర్ట్స్ అతని సహచరుడు వివ్ రిచర్డ్స్ 1971లో ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌కు ఆడారు. అక్కడి నుంచి అతను హాంప్‌షైర్ కౌంటీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

పేస్ క్వార్టెట్ పునాది

1974లో తొలిసారిగా రాబర్ట్స్ విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రాబర్ట్స్ పెద్దగా విజయం సాధించలేదు. కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే అతని బౌలింగ్ అందరినీ ఆకట్టుకుంది. విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ పేస్ క్వార్టెట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి పునాది ఆండీ రాబర్ట్స్ అయ్యాడు. అతడు 6 అడుగుల 2 అంగుళాల పొడవు, వేగంతో పాటు లైన్ అండ్‌ లెన్త్‌ కారణంగా తక్కువ రోజులోనే అత్యంత ఫాస్ట్‌ బౌలర్‌గా ఎదిగాడు. అతను మైకేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, కోలిన్ క్రాఫ్ట్‌లతో కలిసి 1970లలో అత్యంత ఫాస్ట్ బౌలింగ్ దాడిని సృష్టించాడు.

గవాస్కర్, ఇమ్రాన్‌లు వణికిపోయారు..

భారత గొప్ప బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ దృష్టిలో అతని కెరీర్‌లో అత్యంత సమస్యాత్మకమైన బౌలర్ రాబర్ట్స్. రాబర్ట్స్‌కు ఓపెనింగ్ ఓవర్లు వచ్చినా లేదా చివరి ఓవర్లలో అయినా అతని వేగం, ఖచ్చితత్వం ఎప్పుడూ తగ్గేది కాదని గవాస్కర్ చెప్పాడు. అదే సమయంలో గొప్ప పాకిస్తానీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా రాబర్ట్స్ వేసే వేగవంతమైన బంతులను ఆడాలంటే కష్టంగా ఉంటుందని చెప్పాడు.

రెండు రకాల బౌన్సర్లతో వేట

రాబర్ట్స్ బౌలింగ్‌లో అతిపెద్ద లక్షణం అతని బౌన్సర్. అతను ఎప్పుడూ రెండు రకాల బౌన్సర్లను వాడేవాడు. ఒకటి, స్లో బౌన్సర్, మరొకటి ఫాస్ట్ లెథల్ బౌన్సర్. విశేషమేమిటంటే అతడు రెండు బౌన్సర్ల మధ్య తేడాను గుర్తించడం అంత సులభం కాదు. తరచుగా స్లో బౌన్సర్‌తో బ్యాట్స్‌మన్‌ను గందరగోళానికి గురి చేసేవాడు అదే ఓవర్‌లో ఫాస్ట్ బౌన్సర్‌తో ఇబ్బంది పెట్టేవాడు. బ్యాట్స్‌మన్ వికెట్ పడిపోవడం లేదా బ్యాట్స్‌మన్ స్వయంగా నేలపై పడిపోవడం ఏదో ఒకటి జరిగేది.

కేవలం 9 సంవత్సరాల కెరీర్

అతని యుగంలో అత్యుత్తమ బౌలర్ అయినప్పటికీ ఆండీ రాబర్ట్స్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అతను 1983లో రిటైరయ్యాడు. 9 సంవత్సరాల తన కెరీర్‌లో రాబర్ట్స్ 47 టెస్టులు, 56 ODIలు ఆడాడు. టెస్టుల్లో 25.61 సగటుతో 202 వికెట్లు తీశాడు. అదే సమయంలో వన్డేల్లో 87 వికెట్లు పడగొట్టాడు. అతను 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడు. అయితే 1983లో అతడు జట్టులో ఉన్నప్పటికీ వెస్టిండీస్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

వృద్ధుల పేరుపై ఇక్కడ అకౌంట్‌ తెరిస్తే మెరుగైన వడ్డీ.. అనేక ప్రయోజనాలు..

India vs Bangladesh, U19 World Cup: మ్యాచ్‌ ఎప్పుడు ఏ సమయంలో చూడాలో తెలుసుకోండి..?

Viral Photos: ఈ దేశాల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అక్కడి పౌరసత్వం సులువుగా లభిస్తుంది..