Cricket World Cup 2023: ‘నిఘా నేత్రం’ నీడలో ఉప్పల్ స్టేడియం.. 1,500 మందితో భారీ భద్రత.. స్టేడియంలోకి ఉదయం నుంచే..
ఐసీసీ ప్రపంచ కప్ 2023 కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమయ్యింది. భారీ భద్రతను రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ట్రాఫిక్ పోలీసుల నుండి సుమారు 1,500 మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం, సోమవారం,మంగళవారం మూడు రోజుల పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచులు జరగనున్నాయి.

హైదరాబాద్, అక్టోబర్ 05: ఉప్పల్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం రంగం సిద్దమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ఆటగాళ్ల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్ర, సోమ, మంగళవారాల్లో మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో అభిమానులు, క్రికెట్ జట్ల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు.ఇందు కోసం 12వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
ఐపీఎల్ నిర్వహించిన విధంగానే వరల్డ్ కప్ మ్యాచ్ లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామన్నారు.. హెచ్‌సీఏ తో వారం రోజుల క్రితమే మీటింగ్ నిర్వహించామని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మూడు వరల్డ్ కప్ మ్యాచులున్నాయని సీపీ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచే ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామన్నారు. శుక్రవారం నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి..
హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల వివరాలు:
- అక్టోబర్ 6: పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, 2 pm
- అక్టోబర్ 9: న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్, 2 pm
- అక్టోబర్ 10: పాకిస్తాన్ vs శ్రీలంక, 2 pm
ఈ నెల 6,9,10 తేదీల్లో మూడు ఓడీఐ మ్యాచ్ లు జరగనున్నాయి.. వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం భారీ బందోబస్తును రాచకొండ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుండగా.. ఒకేసారి రద్దీ ఉండే నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయించారు. పార్కింగ్‌తోపాటు రూట్ మ్యాప్ విషయంలో ఈసారి స్పెషల్ ప్లాన్ తయారు చేశారు పోలీసులు. మ్యాచ్ ఉన్న రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేశారు.
భారీగా సీసీ కెమెరాలు..
పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బయట నుంచి తెచ్చే ఫుడ్ ఐటెమ్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, మ్యాచ్ బాక్స్ లు అనుమతించబోమన్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తున్నారు. స్టేడియం వచ్చే ప్రతీ ఒక్కరిని నిఘా నేత్రాలు గమనించనున్నాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు కాబట్టి.. మ్యాచ్ అయిపోయాక అందరూ ఒకేసారి వెళ్లకుండా.. దశల వారిగా బయటకి రావాలని సూచించారు పోలీస్ కమిషనర్..
క్రైమ్ టీమ్స్, షీటీమ్స్ గ్రౌండ్ లోపల, బయట మఫ్టీలో ఉంటారని తెలిపారు.. బ్లాక్ లో టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు.. ప్లేయర్స్ ని అవమానపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.. గతంలో వాటర్ ఫెసిలిటీ లేకపోవడంతో ప్రేక్షకులు ఇబ్బందులు పడ్డారని.. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని హెచ్ సీఏ కి తెలిపామన్నారు.
రాచకొండ పోలీసుల భద్రత ఇలా..
- 1,500 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. వీరిలో రాచకొండ పోలీసులు, స్పెషల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాలు ఉండగా.. అల్లర్ల నియంత్రణ దళం సిద్ధంగా ఉంటుంది.
- వాహనం చెక్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలతో సహా స్టేడియం చుట్టుపక్కల మొత్తం 360 CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు.
- తక్షణ చర్య తీసుకోవడానికి నిఘా ఫుటేజీని పర్యవేక్షించడానికి స్టేడియంలో జాయింట్ కమాండ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.
- బాంబు డిటెక్షన్ టీమ్‌ల సహాయంతో యాంటీ విధ్వంసక తనిఖీలు మ్యాచ్ పూర్తయ్యే వరకు 24 గంటలూ అక్కడే ఉంటాయి.
- స్టేడియంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలు, వ్యక్తులను పరీక్షించేందుకు చెక్-పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రేక్షకుల మొబైల్ ఫోన్‌లను చెక్ చేసేందుకు ప్రతి గేటు వద్ద ముగ్గురు మొబైల్ ఫోన్ టెక్నీషియన్‌లను నియమించారు.
- ఈవ్ టీజింగ్‌ను నియంత్రించడానికి.. షీ టీమ్‌లు స్టేడియంలో.. ఆ చుట్టుపక్కల మోహరించబడ్డాయి.
- అధికారులు సూచించిన విధంగా విక్రయదారులు, వారి ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ బృందాలను నియమించారు.
- అక్రిడిటేషన్ కార్డుల మార్పిడి ఖచ్చితంగా నిషేధించబడింది. పాస్‌ల మార్పుపై కూడా కేసులు బుక్ చేయబడతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
