Video: ‘మా నిర్ణయం కాదు’.. భారత్‌తో ఆడాలనుకుంటున్న పాకిస్తాన్.. బహిష్కరణ తర్వాత కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..?
Captain Salman Agha Responds to PCB's Boycott: పాకిస్తాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచ కప్‌నకు తమ జట్టును పంపుతామని ప్రకటించింది. కానీ టోర్నమెంట్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, తొలిసారి పాక్ కెప్టెన్ దీనిపై మాట్లాడాడు.

India vs Pakistan: ఫిబ్రవరి 15న జరిగే టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ పై సందిగ్ధం నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆదివారం నాడు భారతదేశంతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం పాల్గొంటాం, భారత జట్టుతో మ్యాచ్ ను మాత్రం ఆడం అంటూ ప్రకటించింది. అందువల్ల, దాదాపు దశాబ్దంన్నర తర్వాత తొలిసారిగా, రెండు జట్లు ఐసీసీ పురుషుల టోర్నమెంట్‌లో ఒకదానికొకటి తలపడడం లేదని తెలుస్తోంది. కానీ ఇది పాకిస్తాన్ మొత్తం సమిష్టి నిర్ణయమా..? పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్‌లో భారతదేశంతో ఆడాలని కోరుకుంటుందా..? అసలు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఏ మనుకుంటున్నాడో ఓసారి చూద్దాం..
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మళ్ళీ సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా తమ జట్టు టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొంటుందని, శ్రీలంకకు ప్రయాణిస్తుందని ప్రకటించింది. అయితే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మైదానంలోకి దిగదు. పాకిస్తాన్ ప్రకటనలో ఎటువంటి కారణం చెప్పలేదు. కానీ టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
బహిష్కరణపై పాకిస్తాన్ కెప్టెన్ ఏమన్నాడంటే..?
కానీ, ఈ నిర్ణయంలో పాకిస్తాన్ జట్టు మొత్తం ప్రభుత్వం, బోర్డుతో ఏకీభవించిందా? పాకిస్తాన్ కెప్టెన్ అఘా సల్మాన్ ప్రకటన అలా సూచించడం లేదు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ముగిసిన వెంటనే, సల్మాన్ అఘా విలేకరుల సమావేశానికి వచ్చి ఈ నిర్ణయం గురించి ప్రశ్నించారు. అది తన నిర్ణయం కాదని ఆఘా తెలిపాడు. పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడుతూ, “ఖచ్చితంగా మేం (T20 ప్రపంచ కప్‌కు) వెళ్తున్నాం. మిగిలినది (భారత్‌తో ఆడటం లేదు) మా నిర్ణయం కాదు. దాని గురించి మేం ఏమీ చేయలేం. మా ప్రభుత్వం, మా చైర్మన్ ఏమి చెప్పినా మేం చేయాలి” అని అన్నాడు.
బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్..?
పాకిస్తాన్ కెప్టెన్ ప్రకటన పీసీబీ మీడియా మేనేజర్‌ను ఆందోళనకు గురిచేసి ఉండవచ్చు. సల్మాన్ ఖాన్ ప్రసంగం ముగించిన వెంటనే అడ్డుకుని, ఈ విషయం గురించి కాకుండా సిరీస్ గురించి చర్చించాలని పట్టుబట్టాడు. పాకిస్తాన్ ప్రభుత్వం, బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఇది స్పష్టంగా చూపిస్తుంది. యాదృచ్చికంగా, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం అచ్చం బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని వెల్లడిస్తోంది. బంగ్లా కూడా తన ఆటగాళ్లను సంప్రదించకుండా ప్రపంచ కప్‌లో భారతదేశంలో ఆడకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించింది. తత్ఫలితంగా టోర్నమెంట్‌లో తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు, ఈ ఏకపక్ష నిర్ణయం పరిణామాలను పాకిస్తాన్ కూడా ఎదుర్కొనే అవకాశం పెరిగింది.
