Ind Vs Aus 3rd Test: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో కీలక అప్‌డేట్.. వైజాగ్‌లో మూడో టెస్ట్ మ్యాచ్?
Dharmshala: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ధర్మశాలలో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ వేదిక మారనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమైంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకపోయింది. ఇంతలో మూడో టెస్ట్ మ్యాచ్ వార్తల్లో నిలుస్తోంది. మూడో టెస్టు మ్యాచ్‌ని ధర్మశాల నుంచి మార్చే అవకాశం ఉందని, ఇప్పుడు మొహాలీలో జరగవచ్చని భావిస్తున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం ధర్మశాల మైదానం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, అక్కడ అంతర్జాతీయ క్రికెట్‌ను నిర్వహించలేమని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి క్షణంలో వేదికను మార్చేందుకు బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవలసి రావచ్చని అంటున్నారు.
ధర్మశాల స్టేడియం ప్రపంచంలోని అత్యంత అందమైన క్రికెట్ స్టేడియంలలో ఒకటిగా పేరుగాంచింది. చుట్టూ ఎత్తైన కొండలతో ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఇక్కడ జరుగుతుందని ప్రకటించగానే ప్రతి క్రికెట్ అభిమానిలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ 2020 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఈ మైదానంలో నిర్మాణం ప్రారంభమైంది. ఇక్కడ కొత్త అవుట్ ఫీల్డ్, కొత్త డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభం నాటికి ఈ పనులు పూర్తి చేయాలని భావించినా ధర్మశాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆలస్యమైంది.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, మ్యాచ్ తేదీ నాటికి స్టేడియం సిద్ధంగా ఉంటుందని తాము భావిస్తున్నామని, అయితే బీసీసీఐ విచారణ తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొహాలీతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, పుణె వంటి నగరాలు కూడా రేసులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
1వ టెస్ట్ – ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, నాగ్‌పూర్ (భారత్ ఘన విజయం)
2వ టెస్ట్ – 17 నుంచి 21 ఫిబ్రవరి, ఢిల్లీ
3వ టెస్ట్ – మార్చి 1 నుంచి 5 మార్చి వరకు, ధర్మశాల
4వ టెస్ట్ – మార్చి 9 నుంచి 13 మార్చి, అహ్మదాబాద్.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..