DC vs PBKS: ఓటమికి వాడే కారణం.. పీకేస్తే దరిద్రం పోతది.. అక్షర్ పటేల్ ఫైర్

Delhi Capitals vs Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఊహించని ఓటమిని చవిచూసింది. ఏకంగా 264 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ పరాజయం పాలైంది. ఈ ఓటమిపై కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

DC vs PBKS: ఓటమికి వాడే కారణం.. పీకేస్తే దరిద్రం పోతది.. అక్షర్ పటేల్ ఫైర్
Axar Patel Ipl 2026

Updated on: Apr 25, 2026 | 9:36 PM

Delhi Capitals vs Punjab Kings: అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ లోపాలని అక్షర్ పటేల్ కుండబద్దలు కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌లను కరుణ్ నాయర్ ఒకే ఓవర్‌లో రెండుసార్లు జారవిడవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దీనిపై అక్షర్ స్పందిస్తూ.. “మేం పదే పదే అవే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లపై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, మేం ఓడిపోవడానికి పూర్తిగా అర్హులం” అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. కీలక సమయాల్లో క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బౌలర్ల వైఫల్యంపై విమర్శలు..

కేవలం ఫీల్డర్లనే కాకుండా, బౌలింగ్ విభాగాన్ని కూడా అక్షర్ పటేల్ విమర్శించాడు. పవర్ ప్లే ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు విచ్చలవిడిగా పరుగులు సాధిస్తుంటే బౌలర్లు కట్టడి చేయలేకపోయారని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు ప్రతి ఒక్కరు ఓవర్‌కు సగటున 11 పరుగుల కంటే ఎక్కువే సమర్పించుకున్నారు. స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ 46 పరుగులు ఇవ్వగా, ముఖేష్ కుమార్ 3 ఓవర్లలోనే 55 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. పవర్ ప్లేలో పంజాబ్ జోరును ఆపడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని అక్షర్ అసహనం వ్యక్తం చేశాడు.

రికార్డు స్కోరు చేసినా దక్కని విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కె.ఎల్. రాహుల్ కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. నితీష్ రాణా కూడా 91 పరుగులతో చెలరేగాడు. అయితే, ఇంతటి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.

పంజాబ్ అప్రతిహత విజయం..

పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (76), ప్రియాంశ్ ఆర్య (43) తొలి వికెట్‌కు కేవలం 41 బంతుల్లోనే 126 పరుగులు జోడించి పునాది వేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 71 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ అజేయ యాత్రను కొనసాగిస్తోంది. పరాజయాల పరంపరలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్లే ఆఫ్ రేసులో నిలవడం కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us