రికార్డుల రారాజు.. వివాదాల కేరాఫ్ అడ్రస్.. కట్ చేస్తే.. హీరో నుంచి జీరోగా మారిన టీ20 ప్రపంచకప్ తోపు ప్లేయర్
Shakib Al Hasan controversies: టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజల్లో ప్రేక్షకులకు ఫుల్ జోష్ అందించేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే తోపు ప్లేయర్‌గా నిలిచిన ఓ ఆల్ రౌండర్, తన కెరీర్‌లో రికార్డుల కంటే వివాదాలతోనే సంచలనంగా మారాడు.

Shakib Al Hasan controversies: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ కన్న దిగ్గజ క్రికెటర్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ వంటి కీలక జట్లను ఓడించడంలో కీలకంగా మారిన ఆల్ రౌండర్.. ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆకట్టుకుంటున్న ఏకైక ప్లేయర్ షకీబ్ అల్ హసన్.. ఓ సమయంలో తన స్వదేశంలో అడుగు పెట్టేందుకు భయపడ్డాడు. దేశం నుంచి పారిపోయే పరిస్థితులు కూడా ఎదర్కొన్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులతోపాటు 10 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డులు సాధించిన ఈ ప్లేయర్.. అటు బ్యాట్‌తో సెంచరీలు, ఇటు బంతితో ఫైవ్ వికెట్ హాల్స్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
కానీ, ఈ విక్టరీలతోపాటు ఈ బంగ్లా ప్లేయర్ ఎన్నో వివాదాలకు కూడా కారణమయ్యాడు. ఒక పక్క క్రికెట్‌లో మైలురాళ్లను బ్రేక్ చేస్తూ.. మరోపక్క ఆగ్రహంతో ఊగిపోవడం, క్రమశిక్షణారాహిత్యం, ప్రేక్షకులకు ఫింగర్ చూపించడం, మైదానంలో స్టంప్స్‌ను తన్నేయడంతోపాటు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇలా ఇతని కెరీర్ అంతా వివాదాలతోనే ముడి పడి ఉంది. షకిబ్ గొప్ప ఆటగాడైనప్పటికీ, ఆయనలో క్రీడా స్ఫూర్తి ఏ మాత్రం కనిపించదు. ఆయన బంగ్లాదేశ్ క్రికెట్ పేరును ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడో, అంతకంటే ఎక్కువగా దాన్ని అప్రతిష్ఠపాలు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.
కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్..
షకిబ్ అంతర్జాతీయ కెరీర్ 2006లో జింబాబ్వేపై కేవలం 17 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. తన తొలి వన్డేలోనే 30 పరుగులు చేసి, ఒక వికెట్ కూడా తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కాలంలోనే 3 ఫార్మాట్లలో జట్టుకు నమ్మదగ్గ ఆటగాడిగా మారాడు. 2007 వరల్డ్ కప్‌లో భారత్‌పై ఆయన చేసిన హాఫ్ సెంచరీ బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 2008లో న్యూజిలాండ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 36 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 2010 నాటికి ఆయన బంగ్లాదేశ్‌లో ఒక సూపర్ స్టార్‌గా ఎదిగాడు.
వివాదాల పరంపర..
ప్రేక్షకుడిపై ఆగ్రహం (2010): న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సైడ్ స్క్రీన్ దగ్గర ఎవరో కదలడం చూసి షకీబ్ అసహనానికి గురయ్యాడు. చివరకు ఆ వ్యక్తిని తన బ్యాట్‌తో కొడతానంటూ బెదిరించడం గమనార్హం.
మిడిల్ ఫింగర్ వివాదం (2011 వరల్డ్ కప్): వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హోమ్ క్రౌడ్ నిరాశతో ప్లేయర్లను తిట్టడం మొదలుపెట్టగా, షకీబ్ సహనం కోల్పోయి ప్రేక్షకులకు అభ్యంతరకరమైన సైగలు చేశాడు.
అశ్లీల సైగలు (2014 ఆసియా కప్): శ్రీలంకతో మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లో కెమెరా తన వైపు ఉన్నప్పుడు లైవ్ టీవీలో అసభ్యకరమైన సైగలు చేశాడు. దీనివల్ల ఆయనపై భారీ జరిమానా, మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది.
కోచ్‌తో విభేదాలు: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) కోసం బోర్డు అనుమతి ఇవ్వకపోయినా, జాతీయ జట్టు శిక్షణా శిబిరాన్ని వదిలి వెళ్లాడు. అప్పటి కోచ్ తిరిగి రమ్మని మెసేజ్ చేయగా, “నన్ను బలవంతం చేస్తే రిటైర్మెంట్ ఇస్తా” అని బెదిరించాడు.
ఐసీసీ నిషేధం, రీ-ఎంట్రీ..
2019లో ఐసీసీ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం (ఒక ఏడాది సస్పెండ్) విధించింది. బుకీలు తనను ఫిక్సింగ్ కోసం సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయకపోవడమే దీనికి కారణం. 2019 వరల్డ్ కప్‌లో 606 పరుగులు, 11 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన కొద్ది రోజులకే ఈ నిషేధం రావడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు పెద్ద దెబ్బగా మారింది.
2021లో మళ్లీ జట్టులోకి వచ్చినప్పటికీ ఆయన ప్రవర్తన మారలేదు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇవ్వలేదని కోపంతో స్టంప్స్‌ను కాలితో తన్నడం, ఆ తర్వాత స్టంప్స్‌ను పీకి పారేయడం ఆయన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ప్రవర్తనగా నిలిచింది.
నేటికీ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక వికెట్లు (315+) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఒక ఆటగాడిగా ఆయన గణాంకాలు అసాధారణమైనవి. కానీ, ఒక వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
