Babar Azam : బాబర్ ఆజం బిర్యానీ బిర్రుగా తిని బ్యాటింగ్ చేస్తున్నావా? గిల్‌క్రిస్ట్ గట్టిగా ఇచ్చిపడేశాడుగా
Babar Azam : బిగ్ బాష్ లీగ్‌లో బాబర్ ఆజం స్లో ఇన్నింగ్స్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు గెలిచినా బాబర్ ఆటతీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారాయి.

Babar Azam : ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఆటతీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న బాబర్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. అతని బ్యాటింగ్ వేగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, బాబర్ ఇన్నింగ్స్ చూసి అసహనం వ్యక్తం చేశారు. మైదానంలో లైవ్ కామెంటరీ ఇస్తూనే బాబర్‌కు చురకలు అంటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో బాబర్ ఆజం 46 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో బాబర్ సహకారం ఉన్నప్పటికీ, అతని స్ట్రైక్ రేట్ టీ20 ప్రమాణాలకు అనుగుణంగా లేదని గిల్‌క్రిస్ట్ మండిపడ్డారు. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ కేవలం 4 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే బాదడం గిల్‌క్రిస్ట్‌కు నచ్చలేదు. ఇలాంటి స్లో ఇన్నింగ్స్ వల్ల రెండో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
ఫాక్స్ క్రికెట్ కోసం కామెంటరీ చేస్తున్న సమయంలో గిల్‌క్రిస్ట్ బాబర్ ఆటతీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. “బాబర్ ఆజం తన పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఆటగాడు కాదు, అది మనకు తెలుసు. కానీ అతను మైదానంలో మరింత చురుగ్గా ఉండాలి. ప్రతి బంతికి సింగిల్ తీసుకుంటూ పక్కనున్న బ్యాటర్‌పై సిక్సర్లు కొట్టాలనే భారాన్ని నెట్టేయడం ఏమాత్రం సరికాదు. తను కేవలం ఒక పరుగు తీసి తృప్తి పడితే సరిపోదు, ఇన్నింగ్స్‌ను వేగవంతం చేసే బాధ్యత కూడా తీసుకోవాలి” అని గిల్‌క్రిస్ట్ ఘాటుగా విమర్శించారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ బ్రౌన్ 19 బంతుల్లోనే 43 పరుగులతో విరుచుకుపడగా, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 38 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టులో బాబర్ ఆజం బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే లక్ష్యం చిన్నది కావడం, మరోవైపు బ్యాటర్లు సహకరించడంతో సిడ్నీ జట్టు 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. జట్టు గెలిచినప్పటికీ, బాబర్ ఆడిన తీరు మాత్రం ఆస్ట్రేలియా విశ్లేషకుల మనసు గెలవలేకపోయింది.
