పిచ్‌ను మార్చేసి, ఆటగాళ్లపై నిందలెందుకు గంభీర్..: ఏకిపారేసిన కోహ్లీ ఫ్రెండ్..
మొదటి టెస్టులోని పిచ్ మొదట సాధారణ ఉపఖండపు ట్రాక్‌లానే కనిపించింది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. కానీ మొదటి రోజు రెండో అర్ధభాగంలోనే పిచ్ పైపొర దెబ్బతినడం మొదలైంది. ఇక రెండో రోజుకి బ్యాటర్లు ఆడటం దాదాపు అసాధ్యంగా మారింది.

India vs South Africa: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలవడంతో, చాలా మంది అభిమానులు, మాజీ ఆటగాళ్లు అక్కడి పిచ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈ పిచ్‌పై అసమాన బౌన్స్ ఉండటం పేసర్లకు లాభించగా, స్పిన్నర్లకు కూడా బంతి అనుకూలించింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు బౌలర్ సైమన్ హార్మర్ 8 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్‌ను సమర్థించారు. బ్యాటర్లు డిఫెన్సివ్ విధానంతో ఆడి ఉంటే పరుగులు సాధించగలిగేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
పిచ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో భారత జట్టు పేలవ ప్రదర్శనను గంభీర్ పరోక్షంగా విమర్శిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో డివిలియర్స్ మాట్లాడుతూ, “నేను కళ్లు మూసి తెరిచేలోపే టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ‘మాకు కావాల్సిన వికెట్ ఇదే’ అని కోచ్ గంభీర్ అంటున్నారు. ఇవి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు. బహుశా ఆయన ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారేమో.. ‘మనం సిద్ధం చేసుకున్న పిచ్ ఇదే కదా, మరి ఎందుకు రాణించలేకపోయాం?’ అని అడుగుతున్నట్లుగా ఉంది” అని అన్నారు.
“గత మూడు నుంచి ఐదేళ్లుగా భారత్‌లో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే, కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు.
“భారత్‌కు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వారు స్వదేశంలో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయారు, ఇది గతంలో ఎన్నడూ లేనిది. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? భారత ఆటగాళ్లు స్పిన్ ఆడటంలో వెనుకబడ్డారా? నేనలా అనుకోను. ప్రత్యర్థి జట్లు ఇప్పుడు మెరుగ్గా సన్నద్ధమవుతున్నాయి, అక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నాయి,” అని డివిలియర్స్ చెప్పుకొచ్చారు.
మొదటి టెస్టులోని పిచ్ మొదట సాధారణ ఉపఖండపు ట్రాక్‌లానే కనిపించింది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. కానీ మొదటి రోజు రెండో అర్ధభాగంలోనే పిచ్ పైపొర దెబ్బతినడం మొదలైంది. ఇక రెండో రోజుకి బ్యాటర్లు ఆడటం దాదాపు అసాధ్యంగా మారింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానుంది, ఇందులో విజయం సాధించాలని భారత్ భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




