Rohit Sharma : ఆఖరి మ్యాచులో సెంచరీ కొట్టు భయ్యా.. రోహిత్ రిటైర్మెంట్‌పై ఆకాష్ చోప్రా భావోద్వేగ కామెంట్స్
Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా భావోద్వేగంగా స్పందించారు. లార్డ్స్‌లో చివరి మ్యాచ్ ఆడితే సెంచరీతో రాజులా వీడ్కోలు చెప్పాలని కోరారు. సెలక్టర్ల నిర్ణయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ హిట్ మ్యాన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

Rohit Sharma : టీమిండియా దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే రిటైర్మెంట్ వార్తలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జూలై 19న ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌తో హిట్ మ్యాన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందించారు. రోహిత్ రిటైర్మెంట్ వార్తలు, అతని ప్రస్తుత ఫామ్, సెలక్టర్ల నిర్ణయంపై ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆకాష్ చోప్రా విశ్లేషణ ప్రకారం.. వన్డే జట్టు కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరులో చాలా మార్పులు వచ్చాయి. గతంలో మైదానంలోకి దిగితే బౌలర్లపై విరుచుకుపడే రోహిత్, ఇప్పుడు తీవ్ర ఒత్తిడితో ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్‌ప్లే ఓవర్లలోనే హాఫ్ సెంచరీలతో విరుచుకుపడే హిట్ మ్యాన్, ప్రస్తుత ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో పూర్తిగా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాడని ఆకాష్ అభిప్రాయపడ్డారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఆటతీరును ఆకాష్ చోప్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఏకంగా 47 బంతులు ఎదుర్కొని కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 55.32 గా నమోదైంది. మొదటి వన్డేలో కూడా 52.32 అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడు. “రోహిత్ శర్మ తన సహజసిద్ధమైన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. ఒకప్పుడు పవర్‌ప్లేలోనే వీరవిహారం చేసే రోహిత్.. రెండో వన్డేలో 18వ ఓవర్ వరకు క్రీజులో ఉన్నా కేవలం 26 రన్స్ మాత్రమే చేయగలిగాడు. మన మెరుపుల హిట్ మ్యాన్‌ను ఇలాంటి ఆటతీరుతో చూడటం క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు” అని చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించాలనే సెలక్టర్ల నిర్ణయాన్ని ఆకాష్ చోప్రా తప్పుపట్టారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు ఇంకా దాదాపు ఏడాదిన్నర సమయం ఉందని, అంత తొందరగా రోహిత్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. “వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ మరికొంత కాలం వేచి చూసి ఉండాల్సింది. రోహిత్ శర్మకు మరికొన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. అతని ఫిట్‌నెస్ కూడా బాగుంది, అలాంటప్పుడు ఇంత త్వరగా వేటు వేయాలని చూడటం సరికాదు” అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.
చివరగా రోహిత్ శర్మ ఆఖరి వన్డే మ్యాచ్ గురించి ఆకాష్ చోప్రా ఒక భావోద్వేగపూర్వకమైన అభ్యర్థన చేశారు. “ఒకవేళ నిజంగానే జూలై 19న లార్డ్స్ మైదానంలో జరగబోయేది రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే.. నేను కోరుకునేది ఒక్కటే. ‘రోహిత్.. దయచేసి నీ ఆఖరి మ్యాచ్‌లో ఒక భారీ సెంచరీ సాధించు భయ్యా’. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ వేదికగా నిజమైన లార్డ్ లాగా అదరగొట్టు. ఇన్నాళ్లూ వన్డే క్రికెట్‌ను ఒక రాజులా ఎలాగైతే శాసించావో, అదే రాజసం, దర్పంతో ఈ వన్డే ఫార్మాట్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పు” అంటూ ఆకాష్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
